జైలు స్నేహంతో నకిలీ నోట్ల ముద్రణ!
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:36 AM
ఆ నలుగురికీ జైల్లో స్నేహం కుదిరింది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆ నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఒక డెన్‌ను ఏర్పాటు చేసుకొని, నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీ చేయసాగారు.
కోనసీమ జిల్లాలో ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్టు
అమలాపురం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఆ నలుగురికీ జైల్లో స్నేహం కుదిరింది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆ నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఒక డెన్‌ను ఏర్పాటు చేసుకొని, నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీ చేయసాగారు. సోమవారం ఓ దుకాణం వద్ద నకిలీ నోట్లను మార్చేందుకు ప్రయత్నించగా వారి గుట్టు రట్టయింది. ఆ వివరాలను ఎస్పీ రాహుల్‌మీనా సోమవారం మీడియాకు వెల్లడించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా .రామచంద్రపురం మండలం అంబికాపల్లి గ్రామంలో సోమవారం ఓ కిరాణా దుకాణానికి ప్రధాన నిందితుడు పలివెల నూకరాజు మరో వ్యక్తితో కలిసి వచ్చి రూ.500 నోటు ఇచ్చారు. అది నకిలీ నోటని గుర్తించిన షాపు యజమానివారిని ప్రశ్నించారు. దీంతో వారిద్దరూ మోటర్ సైకిల్‌పై పారిపోవడానికి ప్రయత్నించగా.. గ్రామస్థుల సహాయంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నూకరాజు మరికొందరితో కలిసి రూ.500 నకిలీ నోట్లను ముద్రించి కొంత కాలంగా చలామణీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. తనకు జైలులో పరిచయమైన మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, మల్లాడి దేవీప్రసాద్‌లతో కలిసి నకిలీ నోట్ల తయారీకి ప్లాన్ వేశాడు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత రామచంద్రపురం వేములపల్లిలోని వైఎ్‌సఆర్ నగర్‌లో ఓ గదిలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి, రూ.500 నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించారు. విచారణలో నూకరాజు చెప్పిన సమాచారంతో పోలీసులు వారి డెన్‌పై దాడులు చేసి అప్పలరాజు, శ్రీను, దేవీప్రసాద్‌లనూ అదుపులోకి తీసుకున్నారు. నకిలీ రూ.500 నోట్లు, ముద్రణా పరికరాలు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా విచారణ చేపట్టిన రామచంద్రపురం పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.