నకిలీ కరెన్సీ ముఠా ఆటకట్టు!
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:28 AM
నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి, వాటిని అసలు నోట్లుగా చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.02 లక్షల విలువతో ముద్రించిన 100, 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
- నలుగురు నిందితుల అరెస్టు
- రూ.6.02 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
- రూ.30 వేలు అసలు నగదుకు లక్ష రూపాయల నకిలీనోట్లు ఇస్తున్న నిందితులు
- వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
మచిలీపట్నం, ఫిబ్రవరం 4 (ఆంధ్రజ్యోతి) :
నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి, వాటిని అసలు నోట్లుగా చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.02 లక్షల విలువతో ముద్రించిన 100, 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్పీ కార్యాలయం ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన తోమండ్ల రంజితసింగ్, శ్రీకాకుళంజిల్లా జీఆర్‌పురానికి చెందిన బ్రహ్మ ఉమాశంకర్, కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లికి చెందిన అర్జంపూడి దిలీప్, పాశం రాజశేఖర్ వివిధ కేసుల్లో శిక్షపడి జైలుకు వెళ్లారు. ఆ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. రంజితసింగ్‌పై ఒక గంజాయి కేసు, నకిలీనోట్ల తయారీ, చలామణిపై నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. వీరంతా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నకిలీ నోట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పెందుర్తి మండలం కోకఫణిపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని నకిలీ నోట్లు తయారు చేసేందుకు పరికరాలను కొనుగోలు చేసి ముద్రించడం ప్రారంభించారు. రూ.30 వేలు అసలు నగదు ఇస్తే లక్ష రూపాయలు నకిలీ నోట్లు చలామణి చేసేలా దిలీప్, రాజశేఖర్‌తో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ నోట్లను అసలు నోట్లుగా చలామణి చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో వీరు నకిలీనోట్లను అధికంగా వినియోగించారు. కృత్తివెన్ను, తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, పెట్రోల్ బంకులు తదితర చోట్ల నకిలీ నోట్లను అసలు నోట్లుగా చలామణి చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన కృత్తివెన్నులోని మద్యం దుకాణంలో నకిలీ రూ.500 నోట్లు ఇచ్చి దిలీప్, రాజశేఖర్ మద్యం కొనుగోలు చేశారు. నకిలీ నోట్లు ఇచ్చిన ఈ ఇద్దరిపై మద్యం దుకాణం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకు వచ్చింది.
భారీగా నకిలీ నోట్లు స్వాధీనం
నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న తోమండ్ల రంజితసింగ్, బ్రహ్మ ఉమాశంకర్, అర్జంపూడి దిలీప్, పాశం రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5,604 వంద రూపాయల నోట్లు, 84 ఐదువందల రూపాయల నోట్లు, మొత్తంగా రూ.6.02 లక్షల విలువైన నకిలీ నోట్లను, 12 అసలు రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్‌లు, ప్రింటర్‌లు, నకిలీనోట్లు తయారు చేయడానికి ఉపయోగించే పేపర్, రసాయనాలు, తదితరాలను సీజ్ చేసి తీసుకెళ్లారు. నిందితులను బంటుమిల్లి కోర్టులో హాజరుపరిచారు. మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్.రాజా, పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు, మరో రెండు బృందాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును రెండు రోజుల వ్యవధిలోనే చేధించారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఈ సందర్భంగా అభినందించారు.