మాజీ సీఎం నాదెండ్ల పేరుతో నకిలీ ఖాతా
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:24 AM
గత కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైరల్ అవుతున్న వీడియో అనేక వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావునూ లాగారు.
బీఆర్ నాయుడు వైరల్ వీడియోతో పోస్టు
పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు... కేసు నమోదు
కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే విష ప్రచారం: మనోహర్
తెనాలి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): గత కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైరల్ అవుతున్న వీడియో అనేక వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావునూ లాగారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ వైరల్ వీడియోను పోస్టు చేయడం, అది మరింత వైరల్ కావడం వివాదాస్పదమైంది. ఇది అక్కడితో ఆగలేదు. బీఆర్ నాయుడు సొంత చానల్‌లో ఇదో రియాలిటీ షో అని, మిడ్ నైట్ మసాలా వీడియో అని, ఇటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించారని నాదెండ్ల భాస్కరరావే వ్యాఖ్యానం చేసినట్లు ఒక పోస్టును సృష్టించారు. ఈ పోస్టులను చూసిన తెనాలికి చెందిన వెనిగళ్ల నారాయణరావు, జనసేన నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘అది ఫేక్ ఖాతా. దానిని ఎవరు సృష్టించారో అర్థం కావటం లేదు. భాస్కరరావు వయోభారంతో ఏ సాంఘిక మాధ్యమాలూ చూసే పరిస్థితి లేదు. పోస్టులు ఎట్లా చేస్తారనే ఆలోచన కూడా లేకుండా ఆయన పేరుతో వివాదాస్పద పోస్టులు పెట్టటం దారుణం’ అంటూ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ‘జనసేన నేతల ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో ఈ నకిలీ ఖాతాల వెనకున్న వారిని పట్టుకుంటాం’ అని తెనాలి వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు చెప్పారు.
మరీ ఇంత బరితెగింపా..!: మంత్రి మనోహర్
నకిలీ ఎక్స్ ఖాతా ప్రచారంపై నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ‘ఇటువంటి తప్పుడు ప్రచారాలతో తాత్కాలికంగా అబద్ధాలను వైరల్ చేద్దామనుకున్నా, ఎక్కువ కాలం దాగవు. ఇప్పటికే కొందరు మహిళలను ఈ వ్యవహారంలోకి లాగారు. చివరకు నా తండ్రి పేరుతోనే నకిలీ ఖాతాలు తెరచి, వివాదాస్పద పోస్టులు ప్రచారం చేయటం చూస్తే వారు ఎంత బరితెగించారో అర్థమవుతుంది. కేవలం తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే వైసీపీ సోషల్ మీడియా ఇంతటి విషం చిమ్ముతోంది. సాంకేతికంగా జనం అభివృద్ధి చెందారు. ఏది నిజమో, ఏది నకిలీనో తెలుసుకోగల స్థితిలో ఉన్నారు. వైసీపీ నేతలు ఎంతటి అసత్య ప్రచారాలు చేద్దామనుకున్నా నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. కనీసం ఆయన వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా, ఆయన పేరుతోనే ఫేక్ ఖాతా సృష్టించారంటే... భవిష్యత్‌లో ఎంతటి తప్పుడు ప్రచారాలు చేసేందుకైనా వెనకాడరని అర్థమవుతోంది. దీనిని ప్రజలు గమనించాలి. నా తండ్రి పేరుతోనే కాదు... ఎవరి పేరుతో ఈ తరహా తప్పుడు ప్రచారాలకు దిగినా ఉపేక్షించేది లేదు. ఈ ఫేక్ ఖాతాలు, ఫేక్ వీడియోల వెనకున్నవారిని వదిలే ప్రసక్తిలేదు’ అని మంత్రి మనోమర్ హెచ్చరించారు.