Share News

కాలేజీకి వెళ్లి చదవాల్సిందే!

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:42 AM

బీఈడీ, బీపీఈడీ కోర్సులు చేస్తామని 200 మందికి పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు స్టడీ లీవుపై వెళ్లారు. అయితే, ఆయా కోర్సుల కోసం వెళ్లే కాలేజీలలో ముఖ ఆధారిత హాజరు(ఫేస్‌ రికగ్నిషన్‌ అడెండెన్స్‌) వేయాలని వారిని అధికారులు ఆదేశించగా అసలు విషయం బయటపడింది.

కాలేజీకి వెళ్లి చదవాల్సిందే!

  • బీఈడీ, బీపీఈడీ కోర్సులపై ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

  • ఉన్నత విద్యలో ఫేస్‌ రికగ్నిషన్‌ తప్పనిసరి

  • తరగతులకు వెళ్తేనే అటెండెన్స్‌ నమోదు

  • 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు

  • హాజరు అక్రమాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బీఈడీ, బీపీఈడీ కోర్సులు చేస్తామని 200 మందికి పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు స్టడీ లీవుపై వెళ్లారు. అయితే, ఆయా కోర్సుల కోసం వెళ్లే కాలేజీలలో ముఖ ఆధారిత హాజరు(ఫేస్‌ రికగ్నిషన్‌ అడెండెన్స్‌) వేయాలని వారిని అధికారులు ఆదేశించగా అసలు విషయం బయటపడింది. పేరుకు స్టడీ లీవు తీసుకున్నా 20శాతం మంది కూడా ఆయా కాలేజీలకు వెళ్లడం లేదు. కాలేజీ ముఖం చూడకుండానే రెండేళ్ల పాటు ఇంటి వద్దే ఉంటూ కోర్సు పూర్తిచేస్తున్నారు. టీచర్లే కాదు బీఈడీ కోర్సులు చేసేవారిలో సగం మంది కూడా కాలేజీలకు వెళ్లడం లేదు. అసలు కొన్ని బీఈడీ కాలేజీలైతే అడ్మిషన్లు, పరీక్షల సమయంలో మినహా విద్యార్థులను పట్టించుకోవడం లేదు. ఇక ఇతర ఉన్నత విద్య కోర్సులూ దాదాపు ఇలాగే నడుస్తున్నాయి. ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సులు మినహా ఉన్నత విద్యకు సంబంధించిన చాలా కోర్సుల్లో విద్యార్థులు రెగ్యులర్‌గా కాలేజీల ముఖం చూడట్లేదు. చివర్లో పరీక్షలు రాసి సర్టిఫికెట్లు మాత్రం పొందుతున్నారు. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి హాజరు నిబంధనలు కఠినతరం చేస్తోంది. కాలేజీకి వెళ్లే విద్యార్థులందరికీ ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్‌ఎస్‌) తప్పనిసరి చేయనుంది. విద్యార్థులకే కాదు బోధనా సిబ్బందికీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు అమలు చేయనుంది. దీంతో ఇకపై ఉన్నత విద్య కోర్సుల్లో చేరేవారు తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. కాలేజీలకు డుమ్మా కొట్టి, ఇంట్లో కూర్చుని కోర్సులు పూర్తిచేస్తాం అంటే ఇకపై కుదరదు.


దాదాపు 20 లక్షల మంది

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు 20 లక్షల మంది ఉంటారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కోర్సుల్లోనే దాదాపు 15లక్షల మంది విద్యార్థులుంటారు. ఇవి కాకుండా బీఈడీ, లా, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు ఉన్నాయి. వాటిలో ఇంజనీరింగ్‌ కోర్సు మాత్రమే హాజరు మినహాయింపులకు అవకాశం లేకుండా సాగుతోంది. డిగ్రీ కోర్సులోనూ అక్కడక్కడా కాలేజీలకు రాకపోయినా వచ్చినట్లుగా చూపిస్తున్నారు. పీజీ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు రోజూ కాలేజీలకు వెళ్తున్నారనే దానిపై స్పష్టత లేదు. ఇక బీఈడీలో ఎక్కువగా అక్రమాలే కనిపిస్తున్నాయు. ఏపీలో బీఈడీ కోర్సు చేయడం చాలా సులభం అని భావిస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నారు. అడ్మిషన్‌ తీసుకున్న తర్వాత పరీక్షలకు మాత్రమే వారు హాజరవుతారు. ఇక స్థానికంగా ఉండేవారూ బీఈడీ తరగతులకు హాజరవుతున్న దాఖలాలు లేవు. చాలా కాలేజీల్లో బోధనా సిబ్బంది రికార్డుల్లో మినహా కాలేజీల్లో కనిపించడం లేదు.


పోస్టింగ్‌ నచ్చకపోయినా..

పాఠశాల విద్యలో నమోదవుతున్న స్టడీ లీవుల్లో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. స్టడీ లీవు తీసుకుని కాలేజీలకు ఎందుకు వెళ్లడం లేదని ఆరా తీయగా వారిలో కొందరు పోస్టింగ్‌ నచ్చక స్టడీ లీవులోకి వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మారుమూల ప్రాంతానికి బదిలీ అయిన వారు.. అక్కడికి వెళ్లకుండా.. రెండేళ్లపాటు తప్పించుకునేందుకు స్టడీ లీవును అవకాశంగా మార్చుకుంటున్నారు. కొందరు ఎస్జీటీలు బీఈడీ, బీపీఈడీ అంటూ స్టడీ లీవుపై వెళ్తున్నట్లు తెలిసింది. పోనీ కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారా అంటే అదీ లేదు. ఇంటి వద్దే ఉంటూ కోర్సు పూర్తిచేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇకపై ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.


హాజరు కోసం వసూళ్లు

కాలేజీల ముఖమే చూడకుండా కోర్సులు పూర్తిచేస్తున్న వారితో ఉన్నత విద్య లక్ష్యం దెబ్బతింటోంది. ఈ తరహాలో చదివి సర్టిఫికెట్లు పొందుతున్నవారే తిరిగి బోధనా రంగంలోకి అడుగు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉన్నత విద్యలో 75శాతం హాజరు కచ్చితంగా ఉండాలి. ఆ మేరకు హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపులు ఉంటాయి. కాగా, మాన్యువల్‌ హాజరు రికార్డుల్లో అందరూ తరగతులకు హాజరైనట్లుగా చూపిస్తున్నారు. దీనికిగాను ఆయా విద్యార్థులు మేనేజ్‌మెంట్లతో ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. కాలేజీకి రాకపోయినా హాజరు వేసేందుకు కోర్సు ఫీజుకు అదనంగా వసూలు చేస్తున్నారు.


రెండుసార్లు ముఖ హాజరు

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖ ఆధారిత హాజరు వేస్తున్నారు. వారు పనిచేసే కార్యాలయాన్ని ఉద్యోగుల ఐడీలతో జియో ఫెన్సింగ్‌ చేస్తారు. ఉద్యోగులు వారి ఆఫీసుకు వెళ్లినప్పుడు మాత్రమే ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదుకు వీలవుతుంది. ప్రభుత్వ టీచర్లు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు వేస్తున్నారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, తిరిగి సాయంత్రం వెళ్లే సమయంలో నమోదు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాలేజీల్లోనూ విద్యార్థులు, ఫ్యాకల్టీ రెండు సార్లు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయాలి. దీంతో ఇకపై కాలేజీలకు రాకుండా వచ్చినట్లు చూపించే అవకాశం ఉండదు.

Updated Date - Apr 13 , 2026 | 04:43 AM