ఉపాధి శ్రామికుడికి యాప్ షాక్!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:13 AM
ఉపాధి శ్రామికుడికి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ షాకిచ్చింది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్)యాప్ మొరాయించడంతో గ్రామాల్లో శ్రామికులు పనులకు వెళ్లినా హాజరు(మస్టరు) నమోదు కావడంలేదు.
పనిలోకి వచ్చినా హాజరు నమోదుకు ఇబ్బంది
పనులకు ఆటంకంపై కేంద్రానికి అధికారుల ఫిర్యాదు
హుటాహుటిన విజయవాడకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు
అమరావతి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధి శ్రామికుడికి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ షాకిచ్చింది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్)యాప్ మొరాయించడంతో గ్రామాల్లో శ్రామికులు పనులకు వెళ్లినా హాజరు(మస్టరు) నమోదు కావడంలేదు. దీంతో వారు పనులకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఉపాధి పనులు ఆలస్యమవుతోందంటూ కేంద్రానికి రాష్ట్ర అధికారులు ఫిర్యాదు చేయగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హుటాహుటిన రాష్ర్టానికి వచ్చారు. యాప్‌ను సరిచేసేందుకు కుస్తీ పడుతున్నారు. వివరాలివీ.. మస్టర్ల నమోదులో అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరో నెల పెంచడంతో పాటు మన రాష్ట్రానికి ఏప్రిల్ నెల కోసం 4.40 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ నెలలో మన రాష్ట్రంలో ఏ మేరకు పనిదినాలు వాడుకోగలరో అదే మేరకు ‘జీ రామ్ జీ’లో లేబర్ బడ్జెట్ కేటాయించే అవకాశముంది. అందుకే వీలయినంత ఎక్కువ సంఖ్యలో పనిదినాలు కల్పించాలని రాష్ట్ర అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు మండలస్థాయి, క్షేత్రస్థాయి సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించి మానిటర్ చేస్తున్నప్పటికీ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడంలో అంతరాయాలు ఏర్పడటంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ ఢిల్లీ అధికారులకు యాప్ మొరాయింపుపై ఫిర్యాదు చేయడంతో, ఢిల్లీ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులిద్దరు హుటాహుటిన విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం గన్నవరం మండలం సూరంపల్లి, ఉంగుటూరు గ్రామాల్లో పర్యటించారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా శ్రామి కుల హాజరు తీసే ప్రయత్నాలు చేశారు. ప్రాక్టికల్‌గా వారికి సమస్య అర్థం కావడంతో యాప్‌లో లోపాలను గుర్తించారు. అప్‌డేటెడ్ వర్షన్ యాప్ రూపొందించాలని ఢిల్లీకి తెలియజేయడంతో కొత్త యాప్ కోసం ఎదురుచూస్తున్నారు.
యాప్ తెస్తున్న చిక్కులు
ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉపయోగించడం ఉపాధి క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఈ యాప్ ద్వారా కూలీలు నీడలో ఉంటేనే ఫొటో తీసుకుంటోంది. కొంత మందికి ఫొటో తీసిన తర్వాత పలు రకాల ఎర్రర్‌లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈకేవైసీ చేసినప్పటికీ పలువురి అటెండెన్స్ తీసుకోకుండా మొరాయిస్తోంది. ఫొటో తీసిన తర్వాత మిస్‌మ్యాచ్ అనే కామెంట్ వస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్‌తోపాటు మేట్‌లను కొంత మందిని గుర్తించి వారి ద్వారా హాజరు వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇంత చేసినా యాప్‌లో సమస్యలుండటంతో శ్రామికులకు పూర్తి స్థాయిలో హాజరు పొందలేని స్థితి ఏర్పడింది.
ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో ఇబ్బందులు
గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడటంతో పాటు దొంగ మస్టర్లు వేయడంతో సోషల్ ఆడిట్ తనిఖీలో చిక్కుకుని ఉద్యోగాలు కోల్పోయారు. కొన్నిచోట్ల గ్రామాల్లో రాజకీయ పరిస్థితులతో గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. దీన్ని అధిగమించేందుకు ఇటీవల ఆయా జిల్లాల్లో డ్వామా పీడీలు ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే నెలల తరబడి నిరీక్షించిన తర్వాత డైరెక్టర్ వాటిని వెనక్కి పంపడంతో పాటు ఎక్కడా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయరాదని ఆదేశాలిచ్చారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో పక్క గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పచెప్పాలని సూచించారు. అయితే అదికూడా పూర్తికాలేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత అలాగే ఉంది. ఈ కారణంతోనూ మస్టర్ల నమోదు మందకొడిగా సాగుతోంది. కొత్త యాప్ పునరుద్ధరిస్తే గానీ పనులు వేగవంతమయ్యే పరిస్థితి లేదని సిబ్బంది చెప్తున్నారు.