రాష్ట్రం అగ్నిగుండం!
ABN , Publish Date - May 22 , 2026 | 04:45 AM
భానుడి భగభగలకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మరణించారు. గురువారం ఉదయం నుంచే ఎండలు ఠారెత్తించాయి.
కనిగిరిలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత
200 మండలాల్లో 44 డిగ్రీలపైగా నమోదు
ఉదయం నుంచే ఠారెత్తించిన ఎండ
తీవ్ర వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
కోళ్లఫారాల్లో భారీగా కోళ్లు మృత్యువాత
నిడదవోలులో సబ్‌స్టేషన్‌లో మంటలు
26 వరకు వడగాడ్పులు: ఐఎండీ
వడదెబ్బకు 17 మంది మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
భానుడి భగభగలకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మరణించారు. గురువారం ఉదయం నుంచే ఎండలు ఠారెత్తించాయి. తీవ్ర వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మూగజీవాలు సైతం ఎండకు తాళలేక నీడ కోసం చెట్ల కిందకు చేరాయి. రోహిణి కార్తె రాక ముందే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. థార్ ఎడారి నుంచి వేడి గాలులు వాయువ్య, మధ్యభారతం మీదుగా కోస్తాంధ్ర, రాయలసీమ వరకు వీస్తున్నాయి. రుతుపవన ముందస్తు వర్షాలు తగ్గడం, ఉత్తరాదిలో వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం లేకపోవడంతో ఎడారి గాలుల్లో తేమశాతం గణనీయంగా తగ్గింది. దీంతో తీవ్రమైన వడగాడ్పులకు రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం, ఆకాశం నిర్మలంగా ఉండడంతో భరించలేని ఎండ కాసింది. కోస్తాలో తేమ ఎక్కువగా ఉండి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగిలిన ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పడిపోయి, పొడిగాలులు తీవ్రత పెరిగింది. దీంతో అనేక ప్రాంతాలు మధ్యాహ్నానికి అగ్నిగుండంలా మారాయి. ఇళ్లల్లోనూ వేడి తీవ్రతకు జనం తాళలేకపోయారు. ఏసీల వినియోగం భారీగా పెరిగింది. 60 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 219 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. 18 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా, అన్ని జిల్లాల్లోనూ 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 200 చోట్ల 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 48.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాడ్పులకు ఏలూరు జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విజయనగరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా, నంద్యాల, పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎండవేడిమికి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ఎండ వేడికి తట్టుకోలేక ప్రతిరోజూ లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలోని ఒక కోళ్ల ఫారంలో గురువారం 200 కోళ్ల వరకూ చనిపోయాయి. దాదాపు అన్ని కోళ్లఫారాల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది.
నేడు ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత?
శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 219 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45-47 డిగ్రీలు, కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో 43-45, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40-43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని పేర్కొంది. కాగా, ఈనెల 26 వరకు అనేకచోట్ల వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పిడుగుపడి వ్యక్తి మృతి
దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం, మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో గురువారం అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురంలో పిడుగుపడి ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది.
తిరుమలలో భానుడి భగభగలు
తిరుమలలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ రద్దీ, భానుడి సెగలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాదరక్షలు లేని భక్తులు కాలుతున్న నేలపై నడవలేక పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. నాలుగు మాడవీధులను ట్యాంకర్ల నీటితో తడుపుతున్నా కాసేపటికే ఆవిరైపోతోంది. దీంతో భక్తులు కూలింగ్ పెయింట్, రెడ్‌కార్పెట్‌పై త్వరత్వరగా నడుస్తూ షెడ్ల కిందకు చేరుకుంటున్నారు.