Tirumala: రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:32 AM
సూర్యజయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్పస్వామి...
తిరుమల, జనవరి18(ఆంధ్రజ్యోతి): సూర్యజయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్పస్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ఈ వేడుకను ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. ఈఏడాది రథసప్తమి ఆదివారం రావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారనే ఆంచనాతో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆరోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహించనున్నారు.
25న ఏడు వాహనాలపై దర్శనమివ్వనున్న మలయప్ప
వాహనసేవ వివరాలు
సూర్యప్రభవాహనం: ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం 6.45 గంటలు)
చిన్నశేష వాహనం: 9-10గంటలు
గరుడ వాహనం: 11-12గంటలు
హనుమంత వాహనం: 1-2గంటలు
చక్రస్నానం: 2-3గంటలు
కల్పవృక్ష వాహనం: 4-5గంటలు
సర్వభూపాల వాహనం: 6-7గంటలు
చంద్రప్రభ వాహనం: 8-9గంటలు