వైసీపీ నేతలకు భూ సంతర్పణ
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:34 AM
జగన్ హయాంలో వైసీపీ నేతలతో మిలాఖత్ అయి.. నిషేధిత భూములను పట్టా భూములుగా మార్చి వారికే భూసంతర్పణ చేసిన అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డి పాపం పండింది.
గతంలో సీకేదిన్నె తహసీల్దారుగా విధులు
ఆ టైంలో.. ప్రభుత్వ భూములు ధారాదత్తం
జగన్ మేనమామ రవీంద్రకు నమ్మిన బంటు
వైసీపీ నేతలతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్
నిషేధిత భూములను పట్టా ల్యాండ్‌గా మార్పు
50 కోట్ల విలువైన భూములు అప్పగింత
అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు
సస్పెండ్ చేసి సరిపెట్టిన జగన్ సర్కార్
కూటమి హయాంలో సీరియస్.. మళ్లీ విచారణ
అక్రమాల గుట్టురట్టుతో.. పోలీసు కేసు నమోదు
డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డా మజాకా?
కడప, జూలై 20(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో వైసీపీ నేతలతో మిలాఖత్ అయి.. నిషేధిత భూములను పట్టా భూములుగా మార్చి వారికే భూసంతర్పణ చేసిన అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డి పాపం పండింది. ప్రస్తుత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కడప జిల్లా సీకేదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న బి. మహేశ్వర్‌రెడ్డి వైసీపీ హయాంలో కడప నగరానికి ఆనుకుని ఉన్న సీకేదిన్నె మండల తహసీల్దారుగా పనిచేశారు. కడప రింగు రోడ్డు చుట్టూ రెవెన్యూ భూములున్నాయి. ఇక్కడ ఎకరం తక్కువలో తక్కువ రూ.5 కోట్లు పైమాటే పలుకుతోంది. వైసీపీ నేతలతో ముఖ్యంగా జగన్ మేనమామ, కమలాపురం అప్పటి ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డితో చేతులు కలిపిన మహేశ్వర్ రెడ్డి ఆ భూముల రికార్డులు మార్చేసి వారికి అప్పగించేశారు. అంతేకాదు వారితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మహేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది.
వైసీపీ ఆఫీసుగా రెవెన్యూ కార్యాలయం
2019, జూలై 15 నుంచి 2022, జనవరి 3 వరకు మహేశ్వర్‌రెడ్డి సీకేదిన్నె తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో తన కార్యాలయాన్ని వైసీపీ ఆఫీసుగా మార్చారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఆయన పనిచేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిలావుంటే, ఇక్కడ 15.94 ఎకరాల భూమి డాటెడ్ ల్యాండ్(చుక్కల భూమి) ఉంది. నిబంధనల మేరకు ఈ భూమిని ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయ కూడదు. పైగా ఇది 22ఏ నిషేధిత జాబితాలో ఉంది. అయితే, వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ డాటెడ్ ల్యాండ్‌ను ప్రైవేటు ఆస్తిగా మారుస్తూ మహేశ్వర్‌రెడ్డిఉత్తర్వులు జారీ చేసి, అనంతరం ఆ భూములను వైసీపీ బ్యాచ్‌కు అప్పజెప్పారు. దీంతో ఆయా భూముల్లో వైసీపీ ముఖ్య నేతలు భావన టౌన్‌షి్‌ప పేరిట వెంచర్ వేశారు. దీనిలో మహేశ్వర్‌రెడ్డి కూడా బాగస్వామి అని చెబుతారు. దీనిపై అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు వచ్చాయి. మరోవైపు మహేశ్వర్‌రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి సబ్ కలెక్టర్ విచారణ చేపట్టారు. మహేశ్వర్‌రెడ్డి.. వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్లు, అడంగల్ సవరణలు, భూముల నమోదులో భారీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఆ మేరకు నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని అప్పటి కలెక్టర్.. వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో కంటితుడుపు చర్యగా సస్పెండ్ చేశారు. అయితే, రూ.వందల కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలకు, జగన్ కుటుంబ సభ్యులకు మహేశ్వర్‌రెడ్డి కట్టబెట్టడంతో కొద్దిరోజుల్లోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేసినట్లు అధికారవర్గాల్లో చర్చ నడిచింది.
420 కింద కేసు నమోదు
మహేశ్వర్ రెడ్డి సీకేదిన్నెలో చేసిన అక్రమాలపై జగన్ హయాంలోనే ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అప్పట్లో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వాటిని తొక్కిపెట్టారు. తాజాగా డాటెడ్ ల్యాండ్‌ను పట్టాల్యాండ్‌గా మార్పు చేసిన మహేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం కలెక్టరును ఆదేశించడంతో ఆ మేరకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుత సీకేదిన్నె తహసీల్దారు నాగేశ్వర్‌రెడ్డి.. డాటెడ్ ల్యాండ్ 15.94 ఎకరాల భూమిని నిషేఽధిత జాబితా నుంచి తొలగించడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, భావన టౌన్‌షి్‌ప యాజమాన్యానికి రూ.కోట్ల లబ్ధి చేకూరే విధంగా మహేశ్వర్‌రెడ్డి వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మహేశ్వర్‌రెడ్డిపై సీకేదిన్నె పోలీసుస్టేషన్‌లో క్రైం నెం.140/2026 భారతీయ న్యాయసంహిత 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహేశ్వర్‌రెడ్డి మామూలోడు కాదు
సీకేదిన్నె తహశీల్దారుగా పనిచేసిన మహేశ్వర్‌రెడ్డి మామూలోడు కాదనే వాదన ఉంది. మూడు నెలల క్రితం కడపలో వైసీపీ నేత పెద్దదస్తగిరిని ఆ పార్టీ నేతలే హత్య చేశారు. మహేశ్వర్‌రెడ్డి చేసిన ఓ భూ వివాదమే ఆ హత్యకు కారణమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. సీకేదిన్నె మండలం మామిళ్లపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబరు 455/5, 455/6లో సుమారు 6.3 ఎకరాల భూమి చుట్టూ వివాదం నడుస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1978లోనే గువ్వల రాయప్ప, గోవిందు, ఆంటోనీ అనే వారికి ప్రభుత్వం అప్పట్లో డీకేటీ పట్టాలు ఇచ్చింది. అయితే, 2020 ఫిబ్రవరిలో మహేశ్వర్‌రెడ్డి ఈ భూములను ఏ ఆధారం లేకుండా కె. భాస్కర్‌రెడ్డి పేరు మీద ఆన్‌లైన్‌లో రికార్డు మార్చేశారు. అలాగే ఏడాదిలోనే భాస్కర్‌రెడ్డికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆయన పేరు తొలగించి.. అందూరు మాధవీ అనే మహిళ పేరుపై మార్చారు. కోనుగోలు ద్వారా హక్కులు వచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. ఇది అప్పుడు పెద్దసంచలనం అయింది. వాస్తవానికి ఈ భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వారసత్వం కింద ఒకరికి రిజిస్టరు డాక్యుమెంటు లేకపోయినా ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించారు. ఈ వివాదమే పెద్దదస్తగిరి హత్యకు దారితీసిందన్న చర్చ నడిచింది. ఇలా ఒకటి కాదు.. మహేశ్వర్‌రెడ్డి లీలలు చాలానే ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.