Share News

రిలయన్స్‌ బయో ఎనర్జీ కాంప్లెక్స్‌లో పేలుడు

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:44 AM

నిర్మాణంలో ఉన్న రిలయన్స్‌ బయో ఎనర్జీ కాంప్లెక్స్‌లో (సీబీజీ ఉత్పత్తి కేంద్రంలో) భారీ పేలుడు సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడిలో..

రిలయన్స్‌ బయో ఎనర్జీ కాంప్లెక్స్‌లో పేలుడు

  • ఓ ట్యాంకులో మంటలు, దట్టమైన పొగ

  • కార్మికులు లేకపోవడంతో తప్పిన పెనుప్రమాదం

  • తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో ఘటన

కొవ్వూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న రిలయన్స్‌ బయో ఎనర్జీ కాంప్లెక్స్‌లో (సీబీజీ ఉత్పత్తి కేంద్రంలో) భారీ పేలుడు సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడిలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ను మే నెలాఖరుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడి 10 ట్యాంకుల్లోని ఓ ట్యాంకుపైన అమర్చిన బెలూన్‌ మెంబరిన్‌ (పైకప్పు) సోమవారం ఉదయం 9 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో మంటలు, దట్టమైన పొగ అలముకున్నాయి. పెద్ద శబ్దంతో బెలూన్‌ మెంబరిన్‌ పేలిపోయింది. ఈ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పేలుడు తర్వాత పంగిడి, సమీపంలోని గోవర్దనగిరిమెట్ట గ్రామాల ప్రజలు ప్లాంట్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రక్షణ చర్యలు లేకుండా నివాసాల మధ్య పెద్దఎత్తున గడ్డి నిల్వ ఉంచడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జి టీవీ రామారావు, ఏఎంసీ చైర్మన్‌ నాదెళ్ల శ్రీరామ్‌, రెవెన్యూ, ఫైర్‌, పోలీస్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, నిపుణుల కమిటీకి సమాచారం అందించామని ప్లాంట్‌ పర్యవేక్షకులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిసర ప్రాంతాల ప్రజలకు భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 04:44 AM