వేప చెట్లపై తెగుళ్ల దాడి
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:08 AM
రాష్ట్ర వృక్షం వేప చెట్టుకు ఆపద వచ్చింది. అంతుచిక్కని వ్యాధితో వేపచెట్లు ఎండిపోతున్నాయి. కొమ్మలన్నీ పై నుంచి క్రమంగా కిందకు ఎండిపోతూ, పూత మాడిపోతోంది. దీనివల్ల వేప గింజల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని రైతులు చెప్తున్నారు.
కొమ్మలు ఎండిపోయి చెట్టు చనిపోయే ముప్పు
రాష్ట్రంలో వ్యాధిని గుర్తించిన ఉద్యాన వర్సిటీ
సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర వృక్షం వేప చెట్టుకు ఆపద వచ్చింది. అంతుచిక్కని వ్యాధితో వేపచెట్లు ఎండిపోతున్నాయి. కొమ్మలన్నీ పై నుంచి క్రమంగా కిందకు ఎండిపోతూ, పూత మాడిపోతోంది. దీనివల్ల వేప గింజల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని రైతులు చెప్తున్నారు. భారతీయ సంస్కృతి, ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా వేప చెట్టుకు పేరుంది. అలాంటి వేపచెట్లన్నీ ఎండిపోతుండటంపై ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణలో వేలాది వేప చెట్లు చనిపోతున్నట్లు సమాచారం. ‘డై బ్యాక్’, ‘టీ దోమ’ సోకడం వల్ల ఈ విధంగా వేపచెట్లు దెబ్బతింటున్నాయని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. లేకపోతే వేప చెట్లు సమూలంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డై బ్యాక్ వ్యాధిని 1990 దశకంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ సమీపంలో గుర్తించారు. అప్పటి నుంచి ఈ తెగులు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు ఏపీలోనూ కనిపిస్తోంది. ఇది తీవ్రరూపం దాల్చక ముందే సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఫోమోప్సిస్ అజాడిరక్టే అనే శిలీంద్రం(ఫంగస్) చెట్టు కణజాలంపై దాడి చేసి, చెట్టుకు పోషకాల సరఫరాను నిలిపివేస్తుంది. శిలీంద్రంతో పాటు టీ దోమ అనే కీటకం కొమ్మల్లో ఉండే రసాన్ని పీల్చడం వల్ల చెట్టు బలహీనమవుతుంది. దీంతోపాటు టీ దోమ చేసే గాయాల గుండా శిలీంద్రం చెట్టు లోపలికి ప్రవేశించడం వల్ల చెట్టు త్వరగా చనిపోతుంది. దీంతో వేప గింజల ఉత్పత్తి 100శాతం నిలిచిపోయి, వేప నూనె, వేప పిండి తయారీ రంగం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించి, నివారణ మార్గాలను సూచించినట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ఆదివారం మీడియాకు వివరించారు.
తీసుకోవాల్సిన చర్యలు ఇవీ..
తెగులు సోకిన ఎండు కొమ్మలను 15 సెంటీమీటర్ల దిగువున ఆరోగ్యంగా ఉన్న చోట కత్తిరించాలి. కత్తిరించిన ఎండు కొమ్మలను వేప చెట్లకు దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాలి. లేకపోతే.. అందులోని శిలీంద్ర బీజాలు గాలి ద్వారా ఇతర ఆరోగ్యకరమైన చెట్లకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఎండు కొమ్మలను కత్తిరించాక లీటరు నీటిలో ఒక గ్రాము కార్బెండిజిమ్(శిలీంద్రనాశిని), రెండు మిల్లీలీటర్ల ప్రొఫెనోఫా్‌స(కీటక నాశిని)లను కలిపి, చెట్టు చిగుళ్లు, కొమ్మలు బాగా తడిసేలా పిచికారి చేయాలి. చెట్ల కింద రాలిన వేప ఎండుటాకులతో సాయంత్రం వేళ పొగ వేయడం ద్వారా టీ దోమలను అరికట్టవచ్చు. చెట్టు మొదలులో వేప పిండి, సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా చెట్లకు రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు.