Share News

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులకు షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడండి

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:40 AM

పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల పర్యటన మంగళవారం రెండో రోజూ కొనసాగింది. డేవిడ్‌ బి.పాల్‌, గియాస్‌ ఫ్రాంకో డి.సిక్కో...

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులకు షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడండి

  • పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రెండోరోజూ పర్యటన

  • ఫిబ్రవరి నాటికి డయాఫ్రం వాల్‌ పూర్తవుతుందని అధికారుల వెల్లడి

పోలవరం/అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల పర్యటన మంగళవారం రెండో రోజూ కొనసాగింది. డేవిడ్‌ బి.పాల్‌, గియాస్‌ ఫ్రాంకో డి.సిక్కో (అమెరికా), సీస్‌ హించ్‌బెర్జర్‌ (కెనడా).. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కలిసి.. గ్యాప్‌ 1, గ్యాప్‌ 2, డయాఫ్రంవాల్‌ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఎర్త్‌కం రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం, రోలింగ్‌ కోర్‌ పనులలో షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడాలని, అంతర్జాతీయంగా వాటి వినియోగంతో మంచి ఫలితాలుంటాయని నిపుణుల బృందం అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు సూచించారు. ఇప్పటి వరకూ జరిగిన రోలింగ్‌ పనుల్లో ఏ రోలర్లు వినియోగిస్తున్నారనే అడిగారు. ట్రయల్‌ ఎంబాక్‌మెంట్‌ పనుల్లో షీప్‌ ఫుట్‌ రోలర్ల వినియోగంతో సరైన ఫలితాలు రాకపోవడంతో ఫ్లాట్‌ ఫుట్‌, వైబ్రేటెడ్‌ ఫుట్‌ రోలర్లు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో పనులు జరుగుతున్న తీరు, పనుల్లో ఇబ్బందులు, అవాంతరాలు, డిజైన్లు, డ్రాయింగులు తదితర అంశాలపైనా నిపుణులు ఆరా తీశారు. డి హిల్‌ గ్రౌడింగ్‌ పనులను స్వయంగా పరిశీలించారు. ఫిబ్రవరి నాటికి డయాఫ్రం వాల్‌ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. అనంతరం రెండో రోజు పర్యటనకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు సరబ్జిత్‌ సింగ్‌ బక్షి, మనీశ్‌ రాథోడ్‌, గౌరవ్‌ తివారీ, హేమంత్‌ గౌతమ్‌, కేంద్ర మట్టి, రాతి నాణ్యతా పరిశీలన (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) అధికారులు మనీశ్‌ గుప్తా, రవి అగర్వాల్‌, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ప్రతినిధి వీఎస్‌ రామారావు, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రరావు, మేఘా జీఎం గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి పాల్గొన్నారు. విద్యుత్కేంద్రం నుంచి విడుదలయ్యే నీరు దిగువ కాఫర్‌ డ్యాం గుండా రావాలంటే తీసుకోవలసిన చర్యలపైనా చర్చ జరిగింది. ఇందుకోసం దిగువ కాఫర్‌ డ్యాంను కొంత మేర తొలగిస్తే సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్యాప్‌-1 ప్రాంతాన్ని నిపుణులు బుధవారం కూడా పరిశీలించనున్నారు.


డయాఫ్రం వాల్‌కు డీఎ్‌సఎం పితలాటకం!

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆఖరిదైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో డయాఫ్రం వాల్‌కు రెండు వైపులా డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ (డీఎ్‌సఎం) చేయాలంటూ అంతర్జాతీయ నిపుణుడొకరు పట్టుబట్టడం అలజడి రేపింది. వాల్‌ డిజైన్లు ఖరారు చేసినప్పుడు డీఎ్‌సఎం అవసరం లేదని చెప్పిన నిపుణుడే ఇప్పుడు అకస్మాత్తుగా ఈ పితలాటకం పెట్టడంపై.. తోటి నిపుణులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా అవాక్కయ్యారు. డీఎ్‌సఎం చేయడం పెద్ద కష్టంతో కూడుకున్నది కాదు. కానీ ఇందుకోసం ప్రత్యేకంగా యంత్ర సామగ్రి తీసుకురావాలి. కాకపోతే డీఎ్‌సఎం చేసేంత వరకూ ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణం చేపట్టడం కుదరదు. ఇది పూర్తవడానికి కనీసం మూడు నెలలైనా పడుతుంది. అంటే 2027 మార్చినాటికి పూర్తి చేయాలనుకున్న పోలవరం ప్రాజెక్టు తొలిదశ జూన్‌ దాకా పూర్తికాదు. దీనిపై బుధవారం మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 04:46 AM