Health Services Expansion: వైద్య సేవల విస్తరణకు పీపీపీయే మేలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:21 AM
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రానికి కేంద్రం సూచన
ఆరోగ్య కార్యదర్శికి కేంద్ర సంయుక్త కార్యదర్శి లేఖ
మధ్య, చిన్న స్థాయి నగరాల్లో ఆరోగ్య సేవలు తక్కువ
పీపీపీ విధానంలో వీటిని విస్తరించాలి
27 పేజీల మార్గదర్శకాలు
అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. దీనిపై ఓ వివరణాత్మకమైన లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరబ్ గౌర్‌కు రాశారు. దానితో పాటు పీపీపీ ద్వారా వివిధ సేవలను గరిష్ఠ స్థాయిలో అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి లేఖ రాయడాన్ని నెహ్రా ప్రస్తావించారు. దానికి అనుబంధంగా రెండో లేఖను రాస్తున్నామన్నారు. వైద్య సేవల డిమాండ్, లభ్యత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఐదు అంశాల్లో.. నూక్లియర్ మెడిసిన్, సంచార వైద్యశాలలు, దంత వైద్య శాలలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను విస్తరించడానికి పీపీపీ విధానం అమలుపై కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. పరికరాలు సమకూర్చడం, అమలు, నిర్వహణ ద్వారా సేవల లభ్యతను పెంచాలని పేర్కొంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు ప్రైవేటు భాగస్వామి ఆయా సేవలందించడానికి అనుసరించాల్సిన విధానంపై కూడా మార్గదర్శకాలు జారీచేసింది.
క్యాన్సర్, కార్డియో, వాస్క్యులర్, నరాల వ్యాధులకు ఉత్తమమైన సేవల్ని నూక్లియర్ మెడిసిన్ ద్వారా రోగులకు అందించవచ్చని, ఈ సేవల లభ్యత ప్రస్తుత అవసరాల మేరకు, ముఖ్యంగా మధ్య, చిన్న స్థాయి నగరాల్లో బాగా తక్కువగా ఉన్నాయని.. పీపీపీ విధానంలో వీటిని పెంచడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. క్యాన్సర్ వ్యాధి అతి శీఘ్రంగా విస్తరిస్తున్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పెట్, సిటీ, స్పెక్ట్ ఇమేజింగ్, రేడియోథెరపీ సేవలను గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 60 శాతం నుంచి 90 శాతం వరకు వివిధ వయస్కులు దంత సమస్యలతో బాధపడుతున్నా అవసరాల మేరకు వైద్య సేవలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో దంత వైద్య పరికరాలు, వైద్యుల లభ్యత తగు స్థాయిలో లేవని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత వైద్య సేవలను పటిష్ఠం చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖను కోరింది. వ్యాధి నిర్ధారణలో ఎంతగానో ఉపకరించే ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాల లభ్యతను విస్తరించాలని.. అందుకు పీపీపీ విధానం ఉపయోగపడుతుందని తెలిపింది. ముందస్తు స్ర్కీనింగ్, వ్యాధి నిర్థారణ కోసం క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు కూడా ఈ పద్ధతి అనువైనదని పేర్కొంది. 2027-28లోగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నదే కేంద్రం లక్ష్యమని, ఈ దిశగా 2025-26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 14 సెంటర్ల మంజూరు చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తన లేఖలో గుర్తుచేసింది. ఈ లేఖ వివరాలను కార్యదర్శి సౌరభ్ గౌర్ వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌కు వివరించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.