Share News

చిన్నప్పన్న.. పెద్ద దందాలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:21 AM

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్నప్పన్న అక్రమాలు తవ్వేకొద్దీ బయటకొస్తున్నాయి.

చిన్నప్పన్న.. పెద్ద దందాలు

  • నాడు సుబ్బారెడ్డి పీఏగా ఎన్నో అక్రమాలు

  • కల్తీ నెయ్యి సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర

  • షిప్పింగ్‌, షూ కంపెనీల నుంచీ లంచాలు

  • ఖాతాలో మొత్తం రూ.4,69,26,202 జమ

  • నేరుగా కాకుండా ఓ మహిళ బ్యాంకు ఖాతాకు

  • విజయవాడ నుంచి ఆ ఖాతా ఢిల్లీకి బదిలీ

  • ఖాతాను తనే ఆపరేట్‌ చేసిన అప్పన్న

  • కేసు నమోదుకు ఏసీబీ డీజీకి సిట్‌ లేఖ

తిరుపతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్నప్పన్న అక్రమాలు తవ్వేకొద్దీ బయటకొస్తున్నాయి. ఆయన బ్యాంకు ఖాతాలో కల్తీ నెయ్యి లంచాల సొమ్ముతో పాటు ఇతర దందాల తాలూకూ నగదు కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్టు సిట్‌ నిర్ధారించింది. వివిధ పనుల కోసం పలు సంస్థల నుంచి లంచంగా తీసుకున్న నగదు ఆయన ఖాతాలో జమ అయ్యిందని గుర్తించింది. నేరుగా చిన్నప్పన్న ఖాతాకు కాకుండా ఓ మహిళ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు సాగించినట్టు నిర్ధారించింది. గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పీఏగానూ, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగానూ పనిచేసిన క్రమంలో కొన్నేళ్ల పాటు ఢిల్లీలో గడిపాడు. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై దృష్టి పెట్టి వివరాలు సేకరించింది. ఢిల్లీలో ఎస్‌బీఐకి సంబంధించి సంసదీయ బ్రాంచిలోనూ (ఖాతా నం 30691757390), యూనియన్‌ బ్యాంకుకు సంబంధించి ఏపీ భవన్‌ బ్రాంచిలోనూ (ఖాతా నం.056210100049273) ఖాతాలున్నట్టు గుర్తించి వాటి లావాదేవీలను పరిశీలించింది. ఎస్‌బీఐ ఖాతాలో 2019 జనవరి 1నుంచీ 2025 జూన్‌ 10వరకూ మొత్తం రూ.4,69,26,202 జమయింది. రూ.4,64,30,981 విత్‌డ్రా అయింది. 2019 నుంచీ 2024 వరకూ ఆయన జీతభత్యాలు రూ.65 లక్షలు. దీంతో మిగిలిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని సిట్‌ ఆరా తీసింది.


అదంతా లంచాల సొమ్ముగా గుర్తించింది. కాకినాడలో ఓ షిప్పింగ్‌ కంపెనీ నుంచీ లంచంగా తీసుకున్న నగదు, అలాగే ఓ షూ కంపెనీ బిల్లు క్లియరెన్స్‌ కోసం అందిన నగదు అందులో ఉన్నట్టు కనుగొంది. అలాగే ఓ మైనింగ్‌ సంబంధిత పనికి సంబంధించి అందిన నగదు కూడా ఆ మొత్తంలో ఉన్నట్టు నిర్ధారించింది. చిన్నప్పన్న అక్రమ, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సిట్‌ అధికారులు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నపుడు 2014-19 మధ్య చిన్నప్పన్న ఆయనకు పీఏగా పనిచేశాడు. అలాగే 2019-2023 మధ్య వైవీ టీటీడీ చైర్మన్‌గా కొనసాగినప్పుడు కూడా ఆయనకు పీఏగా పనిచేశాడు. ఇక 2019 అక్టోబరు 10న గత ప్రభుత్వం చిన్నప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్‌లో స్పెషల్‌ లైజన్‌ ఆఫీసర్‌గా నియమించింది. 2024 జూన్‌ 1న చిన్నప్పన్న రాజీనామా చేశాడు. మొత్తమ్మీద 2019 అక్టోబరు 16 నుంచీ 2024 జూన్‌ 1 వరకూ వేతనాలు, ఇతర అలవెన్సుల కింద ప్రభుత్వం నుంచీ రూ.64,72,783 అందుకున్నాడు. కాబట్టి ఆయన పబ్లిక్‌ సర్వెంట్‌గా అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తాడని, ఆదాయానికి మించి బ్యాంకు ఖాతాల్లో నగదు, ఆస్తులను కలిగి ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని సిఫారసు చేస్తూ సిట్‌ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాశారు.


ఇవీ అక్రమాస్తులు!

  • చిన్నప్పన్న అక్రమంగా సంపాదించిన పలు ఆస్తులను సిట్‌ గుర్తించింది. 2021 నుంచీ 2024 మధ్య విజయనగరం జిల్లా తగరపువలసలో 5 ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఒక్కొక్కటి 160 చదరపు గజాల స్థలమని సమాచారం.

  • అనకాపల్లి మండలం లంకెలపాలెంలో ఒక్కొక్కటి 240 చ. గజాలున్న 8 ప్లాట్లు కొనుగోలు చేశాడు.

  • విశాఖ రుషికొండ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. ఇవన్నీ చిన్నప్పన్న పేరు మీదే ఉన్నాయని సిట్‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.


విజయవాడ మహిళ పరిచయంతో...

చిన్నప్పన్న లంచాల నగదును నేరుగా తన బ్యాంకు ఖాతాలో వేయించుకోకుండా, విజయవాడకు చెందిన బవిరెడ్డి శ్రీదేవి పేరిట ఉన్న ఖాతాను వాడుకుని, ఆయనే ఆపరేట్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. తాడేపల్లిలోని ఓ అపార్టుమెంటులో నివాసం ఉన్న చిన్నప్పన్నకు అదే అపార్టుమెంటులో ఉన్న మహిళతో పరిచయమైంది. ఆమె ద్వారా ఆమె తల్లి శ్రీదేవి బ్యాంకు ఖాతాను (ఎస్‌బీఐ ఖాతా నం.40670014499) విజయవాడ నుంచీ ఢిల్లీకి మార్చుకున్నట్టు గుర్తించారు. లంచాల నగదును తొలుత శ్రీదేవి ఖాతాలో జమ చేయించి, ఆ తర్వాత ఆ ఖాతా నుంచి ఆయన ఖాతాలకు బదిలీ చేసుకున్నట్టు కనుగొంది. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినపుడు ఈ వివరాలను చిన్నప్పన్న వెల్లడించలేదని, తర్వాత సిట్‌ అధికారులే దర్యాప్తులో భాగంగా గుర్తించారని సమాచారం.

Updated Date - Feb 05 , 2026 | 04:26 AM