Share News

పులి పిల్ల కాదు.. పిల్లి!

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:49 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మర్రివాడ గ్రామంలో గురువారం పులి పిల్లను పోలిన ఓ అరుదైన జాతి పిల్లి హల్‌చల్‌ చేసింది.

పులి పిల్ల కాదు.. పిల్లి!

  • ఏజెన్సీలో అరుదైన జాతి పిల్లి హల్‌చల్‌

  • పులి పిల్లగా భావించి బంధించిన గ్రామస్థులు.. గంట వ్యవధిలోనే మృతి

కొయ్యూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మర్రివాడ గ్రామంలో గురువారం పులి పిల్లను పోలిన ఓ అరుదైన జాతి పిల్లి హల్‌చల్‌ చేసింది. గ్రామస్థులు దాన్ని పులి పిల్లగా భావించి, బంధించి అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే వారు వచ్చే లోగానే అది మృతిచెందింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెరువు వద్ద ఈ పిల్లి తారసపడింది. అది ఆయనపై దాడికి దిగడంతో పరుగున గ్రామంలోకి వచ్చి.. గ్రామస్థులకు చెప్పాడు. ఈ లోగా ఆ పిల్లి గ్రామంలోకి చొరబడి పలువురిపై దాడికి యత్నించింది. దీంతో గ్రామస్థులు గంటకు పైగా శ్రమించి దానిని బంధించారు. అటవీ సిబ్బందికి తెలియజేశారు. గ్రామస్థులు పట్టుకునేంత వరకూ చలాకీగా ఉన్న ఆ పిల్లి.. గంట వ్యవధిలోనే చనిపోయింది. పెదవలస ఇన్‌చార్జి అటవీ రేంజ్‌ అధికారి ప్రశాంతకుమారి, కొయ్యూరు ఎఫ్‌ఎస్‌వో శ్రీరాములు, సిబ్బంది వచ్చి పిల్లి కళేబరాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. అది ఎక్సోటిక్‌ జాతికి చెందిన పిల్లి అని కొందరు, అరుదైన లెపార్డు జాతికి చెందినదని, క్రూరమైనదని మరికొందరు అంటున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 03:50 AM