ధరలు తగ్గించేద్దాం
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:05 AM
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్‌డీపీఎల్) విచ్చలవిడిగా వస్తోంది.
ప్రీమియం లిక్కర్, వైన్‌పై ఎక్సైజ్ నిర్ణయం
మన రాష్ట్రంలో ధరలు చాలా ఎక్కువ
ఫలితంగా పొరుగు నుంచి ఎన్‌డీపీఎల్
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్‌డీపీఎల్) విచ్చలవిడిగా వస్తోంది. ఒక ఖరీదైన ఫారిన్ లిక్కర్ సీసా ధర తెలంగాణలో రూ.22 వేలు ఉంటే... అదే బాటిల్‌ను ఏపీలో రూ.25 వేలకు అమ్ముతున్నారు. మరో బ్రాండ్ రూ.27 వేలు-రూ.33 వేల తేడా ఉంది. ఇక కర్ణాటకతో పోలిస్తే కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరల్లో దాదాపు సగానికి సగం తేడా ఉంది. దీంతో రాష్ట్రంలో ఫారిన్ లేదా ప్రీమియం లిక్కర్ అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటి అమ్మకాలు పెరగాలంటే ఆ బ్రాండ్ల ధరలు తగ్గాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. క్యాబినెట్‌లో ఆమోదం పొందిన వెంటనే ధరలు తగ్గనున్నాయి. ఈ నిర్ణయంతో 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి. ఒక్కో సీసాపై కనీసం రూ.3 వేలు వరకూ తగ్గనుంది. అదే జరిగితే ఇక్కడ అమ్మకాలు పెరిగి మన ఆదాయం మనకే దక్కుతుంది.
అప్పుడే తగ్గిస్తే ఎక్కువ ఆదాయం
వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు పక్క రాష్ర్టాల్లో ఏమాత్రం సంబంధం లేకుండా భారీగా పెంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 40 బ్రాండ్ల ధరలు తగ్గించారు. కానీ ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గించకపోవడంతో ఆ కేటగిరీలో ఎన్‌డీపీఎల్ రాష్ట్రంలోకి వస్తోంది. ఫలితంగా రాష్ట్రం చాలా ఆదాయం కోల్పోతోంది. అలాగే వైన్ ధరలు కూడా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఖరీదైన లిక్కర్‌తో పాటు వైన్‌పైనా ఎడాపెడా పన్నులు వేశారు. దీంతో ఈ రెండు కేటగిరీల్లో అమ్మకాలు దారుణంగా ఉన్నాయి.