తుఫానను ఢీకొట్టిన ఎక్సైజ్ సీఐ కారు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:31 PM
కర్ణాటకకు చెందిన శివభక్తులు ప్రయాణిస్తున్న తుఫాన వాహనాన్ని ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.
దెబ్బతిన్న రెండు వాహనాలు
మద్యం సేవించిన సీఐ?
గోనెగండ్ల, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు చెందిన శివభక్తులు ప్రయాణిస్తున్న తుఫాన వాహనాన్ని ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి గోనెగండ్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ రమేష్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘట నాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరాతీశారు. తుఫాన వాహనంలో ఉన్న కర్ణాటక భక్తులు ఎక్సైజ్ సీఐ అతివేగంగా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కారు డ్రైవ్ చేస్తూ వచ్చి తమ వాహనంను ఢీకొట్టినట్టు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ సీఐ మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు విచారణలో మద్యం సేవించారా లేదా అన్నది తేలాల్సి ఉంది. స్వల్పగాయాల పాలైన సీఐను పోలీసులు విచారించి పంపించేసినట్లు తెలుస్తుంది. తుఫాన వాహనంలో ప్రయాణిస్తున్న భక్తులు కర్ణాటకలోని సింధనూరు ప్రాంతంకు చెందిన వారు. రెండు రోజుల క్రితం శ్రీశైలానికి వెళ్లి అక్కడ పూజలు చేసి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి దర్శనం చేసుకొని తుఫాన వాహనంలో సింధనూరుకు బయలు దేరారు. ఎక్సైజ్ సీఐ రమేష్‌రెడ్డి కారులో కర్నూలుకు బయలు దేరారు. గోనెగండ్లలోని విద్యుత సబ్ స్టేషన దగ్గరకు రాగానే సీఐ ప్రయాణిస్తున్న కారు అతివేగంగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న తుఫాన వాహనంను ఢీకొంది. గోనెగండ్ల సీఐ చంద్రబాబు మాట్లాడుతూ రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గల కారణాలను విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.