పరకామణి నిందితుడు కరుణాకరరెడ్డి మనిషే
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:54 AM
శ్రీవారి పరకామణిలో బంగారు బిస్కెట్ అపహరించే ప్రయత్నం చేస్తూ పట్టుబడిన వ్యక్తి మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి మనిషేనని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు.
రూ.3.లక్షలు తీసుకుని ఉద్యోగమిచ్చాడు
హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్నాడు
2024లో నుంచే దొంగతనాలు చేస్తున్న పెంచలయ్య
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి
తిరుమల, మార్చి 10(ఆంధ్రజ్యోతి): శ్రీవారి పరకామణిలో బంగారు బిస్కెట్ అపహరించే ప్రయత్నం చేస్తూ పట్టుబడిన వ్యక్తి మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి మనిషేనని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. పరకామణి బంగారు బిస్కెట్ అపహరణ అంశంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన ద్వారా స్పందించారు. 2023లో రూ.3 లక్షలు తీసుకుని ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పించింది కరుణాకరరెడ్డే అని తెలిపారు. 2024లో దొంగతనాలు చేయడం ప్రారంభించిన పెంచలయ్య.. 2025లో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. కరుణాకరరెడ్డి హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలకు మసిపూసి.. ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన దొంగతనాలు, అక్రమాలను ప్రస్తుతం ప్రభుత్వం, బోర్డుపై మోపుతూ విషప్రచారం చేస్తున్నారన్నారు.
భక్తుల్లో అపోహలు సృష్టించొద్దు: టీటీడీ
ఇదే అంశంపై టీటీడీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 2025 జనవరి 11న పరకామణిలో విధులు నిర్వహిస్తున్న అబ్రిపోస్ సంస్థకు చెందిన పెంచలయ్య వంద గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని తెలిపింది. ఈ ఘటనపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసి 13వ తేదీన రిమాండ్‌కు పంపినట్టు పేర్కొంది. పోలీసు దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇంటి వద్ద, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా ఘటనా స్థలంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్, ఇంటి సోదాల్లో 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు, పోలీసు కస్టడీలో అదనంగా 76 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని వివరించింది. ప్రముఖ జ్యూవెలరీ దుకాణాల్లో బంగారం మార్పిడి చేసిన ఇన్వాయిస్ రసీదులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. ఈ సంఘటనను వక్రీకరించి పరకామణిలో భారీస్థాయిలో బంగారం దొంగతనం జరిగినట్టు, కోట్ల విలువైన బంగారం మాయమైందని ప్రచారం చేయడం నిరాధారమని, ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడంతోపాటు భక్తుల్లో అపోహలు సృష్టించడం సరికాదని పేర్కొంది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని భక్తులను టీటీడీ కోరింది.