దైన్యం!
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:19 AM
ఈ ఏడాది మినుము సాగు రైతన్నలకు కలిసొచ్చినట్టు లేదు. మిముము తీత ముమ్మరంగా సాగుతున్న వేళ వర్షం వెంటాడింది. తడిసిన పంటను ఎండబెట్టేందుకు, పోగు చేసేందుకు ఎకరానికి అదనంగా రూ.3,500 నుంచి రూ. 5 వేల వరకు రైతులు భరించాల్సి వచ్చింది. మినుము నూర్చిన తర్వాత ఆశించిన ధర వస్తుందనుకుంటే జిల్లాలో మినుము కొనుగోలు చేసే వ్యాపారులంతా కూడబలుక్కుని మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే మేం నిర్ణయించిన ధర ఇంతేనని, అధిక ధర ఎవరైనా ఇస్తే విక్రయించుకోవాలని కటువుగా సమాధానం చెబుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు.
- దిగుబడి, ధరలు తగ్గడంతో మినుము రైతుల్లో ఆందోళన
- ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటా రూ.7,800
- వ్యాపారులు కొనుగోలు చేసేది రూ. 7,700
- ఇటీవల కురిసిన వర్షాలతో తగ్గిన దిగుబడి
- ఆరబెట్టేందుకు, నూర్చేందుకు అదనంగా రూ.5 వేల వరకు ఖర్చు
- ఇదే అదనుగా మరింత ధర తగ్గిస్తున్న వ్యాపారులు
ఈ ఏడాది మినుము సాగు రైతన్నలకు కలిసొచ్చినట్టు లేదు. మిముము తీత ముమ్మరంగా సాగుతున్న వేళ వర్షం వెంటాడింది. తడిసిన పంటను ఎండబెట్టేందుకు, పోగు చేసేందుకు ఎకరానికి అదనంగా రూ.3,500 నుంచి రూ. 5 వేల వరకు రైతులు భరించాల్సి వచ్చింది. మినుము నూర్చిన తర్వాత ఆశించిన ధర వస్తుందనుకుంటే జిల్లాలో మినుము కొనుగోలు చేసే వ్యాపారులంతా కూడబలుక్కుని మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే మేం నిర్ణయించిన ధర ఇంతేనని, అధిక ధర ఎవరైనా ఇస్తే విక్రయించుకోవాలని కటువుగా సమాధానం చెబుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేశారు. ప్రభుత్వం క్వింటా మినుముకు మద్దతు ధర రూ.7,800 నిర్ణయించింది. మినుము తీతలు ప్రారంభమైన తొలిరోజుల్లో క్వింటా మినుమును రూ.9,100 వరకు ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఈ ఏడాది మినుముకు మంచి ధర పలుకుతుందని ఆశించారు. మినుము తీత పనులు వేగవంతం కాగానే ధరలను వ్యాపారులు క్రమేపీ తగ్గిస్తూ వచ్చారు. 15 రోజుల క్రితం వరకు వ్యాపారులు క్వింటా మినుమును రూ.8,500 వరకు ధర చెల్లించి కొనుగోలు చేశారు. గత నెల 19, 20 తేదీల్లో అకాల వర్షం కురవడంతో కోతకు సిద్ధంగా, పనలపై ఉన్న పంట కొంతమేర తడిచింది. ఈ సాకును చూపి మినుము ధరను వ్యాపారులు మరింతగా తగ్గించివేశారు. కంకిపాడు తదితర ప్రాంతాల్లో గతవారం రోజులుగా క్వింటా మినుముకు రూ.7,700 మించి ధర ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు మినుమును విక్రయించాలా వద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. మినుము తీత, నూర్పిడి ఖర్చులకు సంబంధించి కూలీలకు, యంత్రాలకు నగదు చెల్లింపులు చేసేందుకు ఐదారు క్వింటాళ్ల మినుమును వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించేస్తున్నారు.
ఎకరానికి అదనంగా రూ. 5వేల వరకు ఖర్చు
గత నెలలో కురిసిన అకాల వర్షాలకు మినుము పంట తడిసింది. తడిసిన పంటను ఆరబెట్టేందుకు ఇతరత్రా పనులకు రైతులు ఎకరానికి కనీసంగా రూ.3,500 నుంచి రూ.5వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మినుము తీత అనంతరం పనలపై ఉన్న పంట తడిసి ఆరాక కాయలు పగిలి గింజలు రాలిపోవడంతో ఎకరానికి 100 నుంచి 150 కిలోల వరకు దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. అష్టకష్టాలు పడి మినుము పంటను నూర్చి విక్రయించాలని చూస్తే వ్యాపారులు తడిసిన మినుము పప్పు ఎరుపు రంగులోకి మారిందని, నాణ్యత తగ్గడంతో క్వింటాకు రూ.7,700 మించి ధర చెల్లించలేమని తెగేసి చెబుతున్నారు. ఒకవైపు మద్దతు ధర రూపంలో, మరో వైపు దిగుబడి తగ్గడంతో మినుము సాగు ఈ ఏడాది లాభదాయకంగా లేదని రైతులు వాపోతున్నారు.
వ్యాపారుల మాయాజాలం!
కృష్ణానది పరివాహక ప్రాంతంలో బలమైన నల్లరేగడి నేలలు ఉన్న కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, తోట్లవల్లూరు, దివిసీమ ప్రాంతంలోని పలు మండలాల్లో ఎకరానికి సరాసరిన ఈ ఏడాది ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల మేర మినుము పంట దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేసుకున్నారు. సాగు ఆలస్యం కావడం, వర్షం కురవడం ఇతరత్రా కారణాలతో ఈ ఏడాది ఐదారు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మినుముకు మంచి మద్దతు ధర వస్తుందని రైతులు ఆశించిన సమయంలో మినుము పంటను కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను తగ్గించి వేశారు.
లాభాలకు చెన్నై మార్కెట్‌కు తరలింపు!
రైతుల నుంచి క్వింటా మినుమును వ్యాపారులు రూ.7,700 కొనుగోలు చేసి, తెనాలి, గుంటూరు మార్కెట్‌లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చెన్నై మార్కెట్‌కు క్వింటా మినుమును రూ.8,500 విక్రయించేస్తున్నారని రైతులు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మినుము కొనుగోలు చేసే వ్యాపారులంతా కూడబలుక్కుని మినుము ధరను ఇటీవల కాలంలో క్వింటాకు రూ. 800 మేర ధర తగ్గించి వేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా, అవి సక్రమంగా పనిచేయకపోవడంతో వ్యాపారులు మినుము ధరను తమ ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి మినుముకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.