సిఫార్సు ఉన్నా.. టికెట్ కొందాం
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:00 AM
‘‘సిఫార్సు చేయించుకుందాం. త్వరగా ప్రొటోకాల్ దర్శనం అయిపోతుంది. ఒక్క టికెట్ కూడా కొనుగోలు చేయకుండా అమ్మను దర్శించుకుందాం’’ ఇది ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చే కొంతమంది భక్తుల అభిప్రాయం. ప్రస్తుతం ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. సిఫార్సులతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు టికెట్లు కొనుగోలు చేయడం లేదు. కొంతమంది మాత్రం ఎంతమంది దర్శనానికి వస్తున్నారో అందులో సగం మందికి టికెట్లు కొంటున్నారు. అమ్మవారికి ఆదాయం పెరగాలంటే సిఫార్సులతో వచ్చే భక్తులంతా టికెట్ కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ‘కొత్త’ నిర్ణయం!
నూతన సంవత్సరం వేళ చైర్మన్ రాధాకృష్ణ కసరత్తు
ధర్మకర్తల మండలి నుంచే ఆరంభించాలని స్పష్టం
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
‘‘సిఫార్సు చేయించుకుందాం. త్వరగా ప్రొటోకాల్ దర్శనం అయిపోతుంది. ఒక్క టికెట్ కూడా కొనుగోలు చేయకుండా అమ్మను దర్శించుకుందాం’’ ఇది ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చే కొంతమంది భక్తుల అభిప్రాయం. ప్రస్తుతం ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. సిఫార్సులతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు టికెట్లు కొనుగోలు చేయడం లేదు. కొంతమంది మాత్రం ఎంతమంది దర్శనానికి వస్తున్నారో అందులో సగం మందికి టికెట్లు కొంటున్నారు. అమ్మవారికి ఆదాయం పెరగాలంటే సిఫార్సులతో వచ్చే భక్తులంతా టికెట్ కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ విధానాన్ని ముందుగా ధర్మకర్తల మండలి నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి రోజుకు సుమారుగా 30 వేల మంది భక్తులు వస్తుంటారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో మాత్రం 40 వేల నుంచి 50 వేల వరకు ఆ సంఖ్య పెరుగుతుంది. ఇలా వస్తున్న భక్తుల్లో 100 - 200 మంది ప్రొటోకాల్ జాబితాలో ఉన్న ప్రముఖుల సిఫార్సులతో వస్తున్నారు. ఇవి కాకుండా ఆలయ అధికారులు, సిబ్బంది సిఫార్సులతో రోజుకు 200 మంది అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ రెండూ కాకుండా ధర్మకర్తల మండలిలో సభ్యులు తమకు తెలిసిన వారిని దర్శనాలకు పంపుతున్నారు. మరికొంతమంది సభ్యులు దగ్గరుండి మరీ దర్శనాలు చేయిస్తున్నారు.
వెనక ఎంతమంది ఉన్నాసరే..
దుర్గగుడిలో సిఫార్సు జాబితాలో దర్శనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో అధికారులు ఎంతమంది దర్శనానికి వస్తే అందులో సగం మందితో టికెట్లు కొనుగోలు చేయించాలని నిర్ణయించారు. సిఫార్సు జాబితాతో వస్తున్న భక్తులంతా అంతరాలయం తప్ప మరో దర్శనం క్యూలోకి వెళ్లడం లేదు. సిఫార్సులతో వచ్చేవారిలో కొంతమంది భక్తులు మాత్రం ఈ విధానాన్ని పాటిస్తున్నారు. మెజారిటీ భక్తులు ఘాట్‌రోడ్డు నుంచి కొండ మీదకు రాగానే ప్రొటోకాల్ కార్యాలయం వద్దకు వెళ్తున్నారు. ఎవరు సిఫార్సు చేశారో వివరాలు చెప్పగానే అక్కడున్న స్బిబంది వారిని దర్శనాలకు తీసుకెళ్తున్నారు.
నూతన సంవత్సరం.. కొత్త నిర్ణయం
అంతరాలయం దర్శనం టికెటు రూ.500. అటువంటిది ఇది కొత్త ఉచిత దర్శన క్యూగా మారిపోయింది. దీనిపై అధ్యయనం చేసిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ధర్మకర్తల మండలి సభ్యులు కొంతమంది గురువారం ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. వారితో కొంతసేపు భేటీ అయ్యారు. ఇక నుంచి ఎలాంటి సిఫార్సులతో వచ్చినా భక్తులతో టికెట్ కొనుగోలు చేయించాలన్న ప్రతిపాదనను ఉంచారు. ముందుగా ఈ నిర్ణయాన్ని ధర్మకర్తల మండలి సభ్యులు పాటించాలని స్పష్టం చేశారు. సభ్యులు తమకు తెలిసిన వారిని దర్శనానికి పంపినా, దగ్గరుండి దర్శనాలకు తీసుకెళ్లినా రూ.500 టికెట్లు కొనుగోలు చేయించాలని స్పష్టం చేశారు. ఈ విధానం ఇంద్రకీలాద్రిపై తొలుత ధర్మకర్తల నుంచి ప్రారంభం కావాలని కుండబద్ధలు గొట్టారు. దీనికి వారు సుముఖత వ్యక్తం చేశారు. టికెట్ కొనుగోలు పెంచడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వారికి వివరించారు. ఇలా చేయడం వల్ల అమ్మవారికి ఆదాయం పెరుగుతుందన్న భావనలో చైర్మన్ ఉన్నారు.