Share News

సీమలో ప్రాజెక్టులు ఉన్నా రైతాంగానికి అన్యాయం

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:20 PM

రాయలసీమలో ప్రాజెక్టులు ఉన్నా రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరందించడంలో ప్రభుత్వాలు, నాయకులు విఫలమతున్నారని, దీంతో రైతాంగానికి అన్యాయం జరుగుతోందని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్‌ అన్నారు.

   సీమలో ప్రాజెక్టులు ఉన్నా రైతాంగానికి అన్యాయం
మాట్లాడుతున్న రామచంద్రయాదవ్‌

బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్‌

నంద్యాల టౌన, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో ప్రాజెక్టులు ఉన్నా రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరందించడంలో ప్రభుత్వాలు, నాయకులు విఫలమతున్నారని, దీంతో రైతాంగానికి అన్యాయం జరుగుతోందని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్‌ అన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం పట్టణంలోని ఓ లాడ్జి సమావేశ భవనంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నాయకులు ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ వ్యాపారంలో బీజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయడం వదిలేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర, కుందూ నదులు ప్రవహిస్తున్న ముంపునకు గురయ్యే ప్రాంతాలను కాపాడటంలో విఫలవుతున్నారన్నారు. వరదల వల్ల వేలాది క్యూసెక్కుల నీరు సముద్రానికి తరలిపోతున్నా వాటికి అడ్డుకట్టవేయలేకపోతున్నారని, నీటిని సద్వినియోగం చేసుకునేలా శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారని అన్నారు. జిల్లాలో పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది దేవస్థానాల్లో దోపిడీ చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సెజ్‌ కింద నిధులు మంజూరు చేసిందని, ఓర్వకల్లు లాంటి ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి వీలున్నప్పటికీ చేయలేకపోతున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీసీవై పార్టీ కార్యవర్గ సభ్యుడు బండారు నాగేశ్వరరావుయాదవ్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి రఘురాముడు, నాయకులు సాంబశివుడు, మహేశ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:20 PM