Share News

గెలిచినా అప్పులే..!

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:37 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఒకప్పుడు గ్రామపెద్దల మాట, బంధుత్వాలు, ప్రజలతో ఉన్న పరిచయాలు, అభ్యర్థి మంచితనం కీలకంగా ఉండేవి.

  గెలిచినా అప్పులే..!

- సర్పంచ్‌ ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు

- గ్రామాల్లో ఆధిపత్య పోరు.. ఎన్నికల

బరిలో డబ్బు ప్రవాహం

- గెలిచిన వారిలో సంబరాలు.. ఓడిన

వారిలో కన్నీటి ఆవేదన

- చిన్న పంచాయతీల్లోనూ

రూ. లక్షలు దాటిన ఎన్నికల వ్యయం

- గొప్పల కోసం అప్పులు, ఆస్తులు

తాకట్టు పెట్టిన అభ్యర్థులు

- రాజకీయ పోటీ కాస్త ఆర్థిక భారంగా

మారుతోందన్న చర్చ

ఆలూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఒకప్పుడు గ్రామపెద్దల మాట, బంధుత్వాలు, ప్రజలతో ఉన్న పరిచయాలు, అభ్యర్థి మంచితనం కీలకంగా ఉండేవి. కానీ, ప్రస్తుత ఎన్నికల తీరు చూస్తుంటే గ్రామాల్లో సర్పంచ్‌ పీఠం దక్కించుకోవడం ఆర్థికంగా భారమైన వ్యవహారంగా మారిందనే చర్చ జోరందుకుంది. గెలుపు కోసం లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన అభ్యర్థులు.. ఎన్నికల ఫలితాల అనంతరం ఆనందం కంటే అప్పుల లెక్కలతో సతమతమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గెలిచిన వారు సంబరాల్లో ఉంటే... ఓడిపోయిన వారు చేసిన ఖర్చును ఎలా తీర్చాలనే ఆందోళనలో మునిగిపోతున్నారు.

ఓటుకు నోటు.. బహుమతుల వరద

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులతో పాటు నిత్యావసర వస్తువులు, కుక్కర్లు, చీరలు, కోళ్లు, బంగారు ముక్కుపుడుకలు వంటి బహుమతులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చిన్న పంచాయతీల్లో ఓటుకు రూ.10 వేల వరకు ఇచ్చినట్లు గ్రామాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తమ వెంట ఉండే కార్యకర్తలు, క్యాడర్‌ ఇతర వర్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు కూడా అభ్యర్థులు భారీగా ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ఓటర్లను ఆప్యాయంగా పలకరించి, బంధుత్వాలు కలుపుకుని, ఒకరోజు ఉగ్గాని లేదా ఉప్మా ఏర్పాటు చేస్తే సరిపోయేదని... ఇప్పుడు ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్‌ వరకూ డబ్బు, మద్యం, బహుమతుల చుట్టూ తిరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏరూరులో రూ.1.50 కోట్ల ఖర్చు?

చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల్లో గెలుపు కోసం ఒకే పార్టీలోని రెండు బలమైన సామాజికవర్గాలు పోటాపోటీగా తలపడిన ట్లు తెలుస్తోంది. గ్రామంలో తమ ఆధిపత్యాన్ని ని రూపించుకోవాలనే పట్టుదలతో ఒక వర్గం భారీగా ఖర్చు చేయగా, మరో వర్గం కూడా గట్టి పోటీ ఇ చ్చింది. ఈ పోటీలో సర్పంచ్‌ గెలుపు కోసం ఏకం గా రూ.1.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్ర చారం జరుగుతుండడం నియోజకవర్గ రాజకీయా ల్లో సంచలన చర్చకు దారి తీసింది. ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేశారనే ప్రచారం రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది.

మేజర్‌ పంచాయతీల్లో రూ.50 లక్షల నుంచి కోటి వరకు..

ఆలూరు వంటి మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ ఎన్నికల కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆస్పరి మండలం లో టీడీపీ, వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఓటకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచా రం. చింతకుంట, మొలగవల్లి, హత్తిబెలగల్‌ గ్రామాల్లోనూ ఎన్నికల ఖర్చు భారీగానే సాగినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.

ఏకగ్రీవాలకూ రూ. లక్షల్లో ఖర్చు..

ఆలూరు నియోజకవర్గంలో మొత్తం 108 మంది గ్రామ పంచాయతీలు ఉండగా, 12 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో ఆలయాల అభివృద్ధి, గ్రామాభివృద్ధి, శ్మశానవాటికల అభివృద్ధి వంటి కార్యక్రమాలకు లక్షల రూపాయలు వెచ్చించినట్లు చర్చ సాగుతోంది. మిగిలిన పంచాయతీల్లోనూ సర్పంచ్‌ పీఠం కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం, రాజకీయ పార్టీల వద్ద పలుకుబడి పెంచుకోవడం, తమవర్గం బలాన్ని చాటుకోవడం కోసం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిన్న గ్రామాల్లో సైతం లక్షలు ఖర్చు కాగా, మరికొన్ని చోట్ల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది.

గెలిచినా .. ఓడినా అప్పులే..!

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు గ్రామాల్లో విజయోత్సవాలు జరుపుకున్నప్పటికీ తెరవెనుక చేసిన ఖర్చుల లెక్కలు వారిని కలవరపెడుతున్నట్లు చర్చ సాగుతోంది. గెలిచిన సర్పంచులు గ్రామంలో తమ పరువు, ప్రతిష్ట కోసం చేసిన ఖర్చును ఎలా తీర్చాలనే మదన పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటమి పాలైన అభ్యర్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఖర్చు చేసిన కొందరు ఇప్పుడు వాటిని తిరిగి చెల్లించలేక పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.

ప్రజాసేవా?... ప్రతిష్టా పోరా..?

సర్పంచ్‌ పదవి అంటే గ్రామాభివృద్ధికి బాధ్యత వహించే అవకాశం. కానీ ఎన్నికల సమయంలోనే లక్షలు, కోట్లు ఖర్చు చేస్తే ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రజలకు ఎంతవర కు సేవ చేయగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామాల్లో ఆధిపత్యం, రాజకీయ ప్రతిష్ట, పార్టీలో గొప్పలు చెప్పుకోవాలనే పోటీ ఎన్నికలను ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మార్చేస్తోందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయాల్లో సేవ చేయాలనే ఆసక్తి ఉన్న సామాన్యులు సైతం ఎన్నికల ఖర్చులను చూసి వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడితే... గ్రామ ప్రజాస్వామ్యంలో డబ్బున్న వారికే అవకాశాలు ఎక్కువగా మిగిలే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నికల బరిలోకి దిగినవారు.. గెలుపు కోసం చేసిన ఖర్చుల భారంతో గ్రామాభివృద్ధి కంటే అప్పుల లెక్కలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే, ప్రజాస్వామ్య పండుగలో అసలైన విజయం ఎవరిది అన్న ప్రశ్న ఇప్పుడు ఆలూరు నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

Updated Date - Nov 28 , 2026 | 11:37 PM