Share News

కమిటీ రద్దైనా పెత్తనం వారిదే!

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:52 AM

గుడివాడ పట్టణంలోని 12వ వార్డులో నిర్మించిన ఉర్దూ ఘర్‌ కం అంజుమన్‌ భవన్‌ వివాదాల్లో నిలిచింది. ఏడాదిన్నర క్రితం పాత కమిటీ కాలపరిమితి ముగిసినా నేటి వరకు జమా ఖర్చులు అప్పగించకుండా తాత్సరం చేస్తున్నారు. అడిగితే కొత్త కమిటీ వస్తేనే లెక్కలు అప్పగిస్తామంటున్నట్టు తెలిసింది. నాలుగు నెలలుగా గుమాస్తా ఆధ్వర్యంలోనే లావాదేవీలు జరుగుతున్నట్లు ముస్లిం వర్గాలు పేర్కొంటున్నాయి.

కమిటీ రద్దైనా పెత్తనం వారిదే!

- వివాదాల్లో గుడివాడ అంజుమన్‌ భవన్‌

- జమాఖర్చులు అప్పగించకుండా పాత కమిటీ తాత్సరం

- కొత్త కమిటీ వస్తేనే లెక్కలు చూపిస్తామని దాటవేత

- పాత కమిటీ కాలపరిమితి ముగిసి ఏడాదిన్నర

- కొత్త కమిటీ వేసేదెప్పుడో?

ఆంధ్రజ్యోతి - గుడివాడ :

గుడివాడ పట్టణంలోని 12వ వార్డులో నిర్మించిన ఉర్దూ ఘర్‌ కం అంజుమన్‌ భవన్‌ వివాదాల్లో నిలిచింది. ఏడాదిన్నర క్రితం పాత కమిటీ కాలపరిమితి ముగిసినా నేటి వరకు జమా ఖర్చులు అప్పగించకుండా తాత్సరం చేస్తున్నారు. అడిగితే కొత్త కమిటీ వస్తేనే లెక్కలు అప్పగిస్తామంటున్నట్టు తెలిసింది. నాలుగు నెలలుగా గుమాస్తా ఆధ్వర్యంలోనే లావాదేవీలు జరుగుతున్నట్లు ముస్లిం వర్గాలు పేర్కొంటున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉర్ధూ ఘర్‌ కం అంజుమన్‌ భవన్‌ నిర్మాణ పనులు ప్రారంభమై 85శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులను పూర్తి చేశారు. ఎంపీ నిధులు రూ.25 లక్షలు, మున్సిపల్‌ నిధులు రూ.10 లక్షలు నిర్మాణానికి వెచ్చించారు. 2020, ఆగస్టు 12వ తేదీన ఈ భవనం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ ముస్లిం మైనార్టీలకు చెందిన చిన్నారులు ఖురాన్‌ పఠనం చేస్తున్నారు. మైనార్టీలు చిన్న చిన్న ఫంక్షన్‌లకు వినియోగించుకుంటున్నారు.

ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం

మైనార్టీలు నిర్వహించుకునే చిన్న చిన్న శుభకార్యాల ద్వారా ఈ భవనానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని మైనార్టీ నాయకులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ఉర్ధూ ఘర్‌ కం అంజుమన్‌ భవన్‌ కమిటీ కాలపరిమితి ముగిసి ఏడాదిన్నర అవుతుంది. ఆ నాటి నుంచి నేటి వరకు జమాఖర్చులు అప్పగించిన దాఖలాలు లేవు. పలుమార్లు ముస్లిం మైనార్టీ కూటమి నాయకులు అడిగితే కొత్త కమిటీ వస్తే లెక్కలు అప్పగిస్తామని తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. భవన్‌లో పనిచేసే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలంటే పాత కమిటీ సంతకాలు కావాల్సిందే. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయినా, కమిటీ ఆటోమెటిక్‌గా రద్దైన ఏడాది పాటు తాళాలు ఇవ్వడానికి పాత కమిటీ నానాయాగీ చేసిందని వినికిడి. ఆ తర్వాత కొన్నాళ్లకు తాళాలను అప్పగించినా, నేటికీ లెక్కలు అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగు నెలలుగా అంజుమన్‌ భవన్‌ లెక్కలన్నీ గుమాస్తా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పాత కమిటీ లెక్కలు అప్పగించకున్నా, వస్తున్న ఆదాయాన్ని బ్యాంకులో జమచేస్తున్నారు. పాత కమిటీ చేతుల్లోనే నేటికి చెక్‌పవర్‌ ఉండటంతో గందరగోళం ఏర్పడింది. జీతభత్యాలు చెల్లించాలంటే పాత కమిటీ వారివద్దకే వెళ్లాల్సి వస్తోంది.

మూడు నెలలుగా కసరత్తు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అంజుమన్‌ భవన్‌కు కొత్త కమిటీ నియమించకపోవడం ముస్లిం వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో మూడు నెలలుగా కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు గానీ కొలిక్కి రావడంలేదు. ముస్లిం మైనార్టీ నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, కొత్త నాయకులు నాయకత్వం కోసం అత్యుత్సాహం చూపడం వంటి కారణాలతో కొత్త కమిటీ నియామకంలో తాత్సరం జరుగుతోంది. మసీదు కమిటీల్లో తమకు చోటు ఇవ్వడం లేదని, అంజుమన్‌ భవన్‌ కమిటీలో అయినా తమకు ప్రాధాన్యత కల్పించాలని యువ నాయకత్వం డిమాండ్‌ చేస్తోంది.

Updated Date - Mar 03 , 2026 | 12:52 AM