Share News

Minister Payyavula Keshav: దెయ్యాలూ సిగ్గుపడతాయ్‌!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:36 AM

రాజధాని అమరావతి, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై జగన్‌ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

Minister  Payyavula Keshav: దెయ్యాలూ సిగ్గుపడతాయ్‌!

  • జగన్‌ చేసింది సీమ ‘థెఫ్ట్‌’ ఇరిగేషన్‌

  • ఆయన మాటల్లో ప్రేమ.. చేతల్లో విధ్వంసం

  • ఎవరు ద్రోహం చేశారో చర్చకు సిద్ధమా?

  • మంత్రులు, ఎమ్మెల్యేల ఫైర్‌

  • అసెంబ్లీకి వస్తే.. చర్చిస్తాం: మంత్రి కేశవ్‌

అమరావతి/జగ్గయ్యపేట, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై జగన్‌ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆయన మాటలు వింటే దెయ్యాలు కూడా సిగ్గు పడతాయన్నారు. ‘వైనాట్‌ 175’ అని 11 సీట్లకు పరిమితమైనా ఇంకా జ్ఞానోదయం కాలేదని, ఆయన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్‌ రాజు మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌ నోట ప్రతి మాటా అబద్ధమే. రాయలసీమ లిఫ్ట్‌ వైసీపీ హయాంలో పూర్తి చేశామనడం పూర్తిగా అవాస్తవం. దానికి డీపీఆర్‌ సిద్ధం చేసుకునేందుకే పనులు చేసినట్లు ఆయనే అఫిడవిట్‌ వేశారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.900 కోట్లు రుణం తెచ్చి.. దారి మళ్లించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను.. సీమ థెఫ్ట్‌ ఇరిగేషన్‌గా మార్చుకున్నారు. దీనిపై చంద్రబాబు కేసులు వేశాడంటాడు. నిజానికి కేసులు వేసింది ఎవరో ఆయనకు తెలీదా? చీకటి ఒప్పందాలు ఎవరివో అందరికీ తెలుసు. గండికోట తానే కట్టానంటాడు.


వెలిగొండకు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌ పెట్టారు. కుప్పానికి నీరిచ్చామంటున్న ఆయన మాటలు నమ్మితే దెయ్యాలు, పిల్లులు కూడా సిగ్గుపడతాయి. ఆయన మాటల్లో ప్రేమ.. చేతల్లో విధ్వంసం. క్రెడిట్‌ చోరీ అంటున్న జగన్‌కు.. అసలు క్రెడిట్‌ ఏముంది? ఏడాదిన్నరలో పరిమితుల ప్రకారమే రూ.79 వేల కోట్ల అప్పు తెచ్చాం’ అని కేశవ్‌ చెప్పారు. సీమ కోసం జగన్‌ ఏమీ చేయలేదని బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎక్కువ కాలం రాయలసీమ బయట ఉన్న జగన్‌కు సీమ పేరు ఎత్తే హక్కు, అర్హత లేవని కాల్వ అన్నారు. ‘సీమ వెనుకుబాటు తనం, అక్కడి ప్రజల పేదరికమే ఆయనకు రాజకీయ పెట్టుబడి. సీమ ప్రాజెక్టుల్లో వందల కోట్లు దోపిడీ చేశారు’ అన్నారు. రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో తేల్చేందుకు జగన్‌ చర్చకు రావాలని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు సవాల్‌ చేశారు.

Updated Date - Jan 09 , 2026 | 04:37 AM