Share News

తిరుమలలో ‘ఈవీ’ చార్జింగ్‌ పాట్లు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:04 AM

ఓవైపు దేశవ్యాప్తంగా ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి.

తిరుమలలో ‘ఈవీ’ చార్జింగ్‌ పాట్లు!

  • కొండపై ఒక్క చోటా లేని పాయింట్‌

  • ఎలక్ర్టిక్‌ వాహనాలతో కొండ ఎక్కేందుకు భయపడుతున్న భక్తులు

  • చార్జింగ్‌ కోసం తిరుపతిలోనే వెయిటింగ్‌

  • తిరుమలకు వచ్చే వాహనాల్లో 10 శాతం మేర ఎలక్ర్టిక్‌ బైక్‌లు, కార్లు

తిరుమల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఓవైపు దేశవ్యాప్తంగా ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పెద్దఎత్తున భక్తుల తాకిడి ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈవీ వాహనాలకు అవసరమైన ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు లేవు. దీంతో కొండపైకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈవీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీవారి కోసం అత్యధికంగా భక్తులు సొంత వాహనాల్లోనే తిరుమలకు వస్తున్నారు. కొవిడ్‌ సమయం నుంచి రైళ్లు, బస్సుల సేవలను వినియోగించుకునే వారి సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో తిరుమల కొండకు నిత్యం దాదాపు 8 వేల నుంచి 10 వేల వాహనాలు వస్తున్నాయి. వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య 15 వేల వరకు ఉంటుంది. తిరుమలకు వస్తున్న వాహనాల్లో దాదాపు 10 శాతం ఎలక్ర్టిక్‌ బైక్‌లు, కార్లు ఉంటున్నాయి. కొండపైకి వెళ్లిన తర్వాత బ్యాటరీ అయిపోతుందేమో అనే భయంతో చార్జింగ్‌ కోసం తిరుపతిలోనే వాహనాలను ఆపుతున్నారు. కొండ ప్రాంతం కావడంతో చార్జింజ్‌ ఎంత దూరం వస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదు. దీంతో ఈవీతో కొండకు వెళ్లాలా వద్దా అనే సందేహంలో ఉండిపోతున్నారు. కుటుంబ సమేతంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులు తిరుమలలో చార్జింగ్‌ సదుపాయం లేక కింద తిరుపతిలో అదనపు సమయం గడపాల్సిన పరిస్థితి నెలకొంది.


కాలుష్య నియంత్రణ లక్ష్యానికి కీలకం

ప్రస్తుతం తిరుమల-తిరుపతి మధ్య 64 ఆర్టీసీ ఎలక్ర్టిక్‌ బస్సులు తిరుగుతున్నాయి. కొండపై ఉచిత ప్రయాణానికీ టీటీడీ ఎలక్ర్టిక్‌ బస్సులనే వినియోగిస్తోంది. అధికారులు కూడా ఈవీ కార్లనే వినియోగిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా చార్జింగ్‌ స్టేషన్లు ఉండగా.. భక్తుల కోసం చార్జింగ్‌ పాయింట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. గతంలో పీఏసీ5 వద్ద ఓ స్టేషన్‌ నెలకొల్పినప్పటికీ.. వినియోగంలో లేకుండా కొద్ది రోజుల్లోనే కనుమరుగైపోయింది. తిరుమలలో కాలుష్య నియంత్రణ కోసం అనేక చర్యలు చేపడుతున్న టీటీడీ, ఈవీ వాహనాల చార్జింగ్‌కు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ సమస్యపై టీటీడీ అధికారులు స్పందిస్తూ.. అలిపిరిలో 2, తిరుమలలో 2 చోట్ల ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని, హెచ్‌పీ, ఐవోసీఎల్‌తో చర్చలు చేశామని తెలిపారు. రెవెన్యూ షేర్‌ పద్ధతిలో ఇతర సంస్థలతో లేదా టీటీడీ ఎలక్ర్టిక్‌ విభాగం నుంచే ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేసే అంశంపై పరిశీలన చేస్తున్నామన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 04:05 AM