కల్తీ పాలలో విషపూరిత ఇథలీన్ గ్లైకాల్
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:40 AM
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరణాలకు ఇథలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనమే కారణమని ల్యాబొరేటరీ రిపోర్టులు తేల్చాయి.
నివేదికలో వెల్లడైందన్న తూర్పు గోదావరి ఎస్పీ
చనిపోయిన ఐదుగురి రిపోర్టులు అందించిన ల్యాబ్
మూత్రపిండాల ఫెయిల్యూర్‌తోనే మరణం
శనివారం మరొకరు మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య
రాజమహేంద్రవరం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరణాలకు ఇథలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనమే కారణమని ల్యాబొరేటరీ రిపోర్టులు తేల్చాయి. ఆ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ శనివారం వెల్లడించారు. గత నెల 16న కల్తీ పాలను తాగిన కొందరికి మూత్రం రావడం నిలిచిపోయి కిడ్నీ సంబంధిత సమస్య (అనూరియా)తో వివిధ ఆస్పత్రుల్లో చేరారు. 22న తాడి కృష్ణవేణి అనే మహిళ అదే సమస్యతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరికొందరు అదే సమస్యతో వివిధ ఆస్పత్రుల్లో చేరారు. తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఫిర్యాదుతో 22న త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బాధితులందరూ కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్న అడ్డాల గణేశ్వరరావు వద్ద పాలు కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. అతను రాజమహేంద్రవరంలోని లాలాచెరువు, చౌడేశ్వరనగర్, స్వరూ్‌పనగర్ ప్రాంతాల్లోని వారికి పాలు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో గతనెల 15న సరఫరా చేసిన పాలు చేదుగా ఉన్నాయని కొంతమంది ఖాతాదారులు గణేశ్వరరావుకు చెప్పినా వినకుండా 16న మళ్లీ అలాంటి పాలే సరఫరా చేశాడు.
ఫ్రీజర్‌ని రాజమహేంద్రవరంలో మరమ్మతు చేయించినట్టు చెప్పాడు. దీంతో అతడు ఉపయోగించిన ఫ్రీజర్, ఇతర పదార్థాల నమూనాలను రీజినల్ సైన్సు ల్యాబొరేటరీతో పాటు ఇతర ల్యాబ్‌లకు కూడా పంపించామని ఎస్పీ తెలిపారు. మొదట చనిపోయిన ఐదుగురికి సంబంధించిన రిపోర్టులు శనివారం రాగా ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి తుది అభిప్రాయాన్ని వెల్లడించారని చెప్పారు. బాధితులు విషపూరితమైన ఇథలిన్ గ్లైకాల్ కలిసిన పాలను తాగడం వల్ల అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్‌కి గురై వివిధ అవయవాలు పాడై చనిపోయారని నిర్ధారించారన్నారు. బాధితుల్లో డెల్టా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.అనంతలక్ష్మి(72) శనివారం మరణించారని.. మరో 10 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ల్యాబ్ రిపోర్టుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. కాగా, మొత్తం 20 మంది బాధితుల్లో ఇప్పటి వరకూ 10 మంది చనిపోయారు.
అత్యంత ప్రమాదకరం..
తీపి రుచిని కలిగి ఉండే ఇథలీన్ గ్లైకాల్ అత్యంత విషపూరితమైనది. దీనిని సాధారణంగా వాహనాల రేడియేటర్లలో యాంటీ ఫ్రీజ్‌గా వినియోగిస్తారు. ఏదైనా ద్రవాల్లో చిక్కదనం తగ్గకుండా ఉండటానికి ఈ రసాయనాన్ని కలుపుతారు. ఇది స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళ్లినా ప్రాణాపాయం సంభవించవచ్చు. ఇథలీన్ గ్లైకాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఆక్సాలిక్ యాసిడ్‌గా మారుతుంది. ఇది రక్తంలోని కాల్షియంతో కలిసి స్పటికాలను ఏర్పస్తుంది. ఆ స్పటికాలు కిడ్నీల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తాయి. తర్వాత కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి.