Legislative Assembly Ethics Committee: వైసీపీ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం!
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:57 AM
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా వేతనాలు, టీఏ, డీఏలు పొందుతుండటంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది.
అసెంబ్లీకి రాకుండా వేతనం, టీఏ, డీఏలు పొందడమేంటి?
అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఎథిక్స్ కమిటీలో చర్చ
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా వేతనాలు, టీఏ, డీఏలు పొందుతుండటంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో కమిటీ చైర్మన్ మండ లి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడం, హోదా ఇస్తేనే సభకు వస్తామనడం దేశ చరిత్రలోనే తొలిసారి అని వ్యాఖ్యానించారు. సమావేశాలకు రాకుండా 10మంది వైసీపీ ఎమ్మెల్యేలు వేతనాలు తీసుకుంటున్నారని, వారిలో ఆరుగురు టీఏ, డీఏలు క్లెయిమ్ చేశారని ఎథిక్స్ కమిటీ కి అసెంబ్లీ అధికారులు సమాచారం ఇచ్చారు. సదరు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిపించాలని జ్యోతుల నెహ్రు కోరారు. దీనిపై బుద్ధప్రసాద్ స్పందిస్తూ.. నోటీసులు ఇచ్చి పిలిపించడం కన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధాన నగరాల్లో మేధావులు, ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, దాని ప్రకా రం ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందన్నారు. ఎథిక్స్ కమిటీలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే హాజరైనందున వచ్చే భేటీలో ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి వద్దామని చైర్మన్ చెప్పారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ సభ్యులు హాజరుకావాలని బుద్ధప్రసాద్ కోరారు.