Share News

నేడు ఏరువాక

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:35 AM

నైరుతి రుతు పవనాలు విస్తరించి, మృగకార్తెతో తొలకరి వర్షాలు కురిసే వేళ.. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా రైతులు పండుగగా జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని వ్యవసాయ శాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది.

నేడు ఏరువాక

  • రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణకు ఏర్పాట్లు

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు విస్తరించి, మృగకార్తెతో తొలకరి వర్షాలు కురిసే వేళ.. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా రైతులు పండుగగా జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని వ్యవసాయ శాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఏరువాక రాష్ట్ర వేడుక గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ పరిశోధన స్థానంలో జరగనున్నది. ఈ వేడుకలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులతోపాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. జిల్లాల్లో జరిగే ఏరువాక ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విధానాలు, సాంకేతికత, ఆధునిక యంత్ర పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే పద్ధతులను వివరించనున్నారు. కాగా నైరుతి రుతుపవనాలు ఈ నెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. గత వారం నుంచి ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో రుతు పవనాల కదలికతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైతులు పంటల సాగు చేపడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 10లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. మెట్ట ప్రాంతాల్లో విత్తనం మొలకెత్తేందుకు అనువుగా వర్షాలు పడగా.. రైతులు పత్తి, అపరాలు విత్తనాలు ఎదలు పెడుతున్నారు. మే4న పెన్నా డెల్టా, జూన్‌1న గోదావరి డెల్టా, 15న వంశధార కాలువలకు నీరు విడుదల చేయగా, జూలై1న కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయనున్నారు. ఆయా డెల్టాల్లో వరిసాగుకు రైతులు ఇప్పటికే నారుమళ్లు వేసుకున్నారు. వచ్చే నెలలో పంటల సాగు మరింత పుంజుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jun 29 , 2026 | 04:36 AM