Share News

ఎర్రన్నాయుడుకు ఘన నివాళి

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:25 AM

కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం ఆయన 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఎర్రన్నాయుడుకు ఘన నివాళి

  • స్వగ్రామంలో నివాళులర్పించిన రామ్మోహన్‌నాయుడు

టెక్కలి, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం ఆయన 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి సోమవారం ఆయన తనయుడు, కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానికులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని, ఎర్రన్నాయుడు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఢిల్లీలో: పార్లమెంటులోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎర్రన్నాయుడి జయంతి వేడుకలను టీడీపీ నేత నౌపడ సత్యనారాయణ అధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎర్రన్న సేవలు మరువలేనివి: సీఎం చంద్రబాబు

మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. ‘నాకు అత్యంత ఆప్తులు ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. చివరి క్షణం వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఎర్రన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం’ అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. మంత్రి లోకేశ్‌ కూడా ఎర్రన్నాయుడికి నివాళులర్పించారు.

Updated Date - Feb 24 , 2026 | 04:26 AM