ఆలయాల్లో ఈ-ఆఫీస్ సేవలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:59 AM
రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల దర్శన, సేవల టికెట్ల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరగాలని దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదేశించారు.
దర్శనం, సేవల టికెట్లు ఆన్‌లైన్‌లోనే
భవన నిర్మాణాలు ఏడాదిలో పూర్తిచేయాలి
ఆలయ ఉద్యోగులందరికీ వెంటనే పదోన్నతులు
ఉత్తర్వుల్లో 50ు తెలుగులోనే ఉండాలి
ఈవోలకు దేవదాయ కమిషనర్ ఆదేశాలు
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల దర్శన, సేవల టికెట్ల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరగాలని దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదేశించారు. శాఖలో విధులు నిర్వహించే ఈవోలు, ఏసీలు, డీఈవో (జిల్లా ఎండోమెంట్ అధికారి) ఈ ఏడాదిలో ఏ పనులపై దృష్టిపెట్టాలో నిర్దేశిస్తూ బుధవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. 6(బీ), 6(బీ) ఆలయాల్లో వంద శాతం ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయానికి సంబంధించిన లీజులు కనీసం 30శాతం వసూలు చేయాలన్నారు. ఆలయాల్లో అందించే సేవలపై భక్తుల్లో సంతృప్తి స్థాయి 80శాతం పైన ఉండాలని పేర్కొన్నారు. సీజీఎఫ్ కింద చేపట్టిన నిర్మాణాలను ఈ ఏడాది చివరి నాటికి 50 శాతానికి పైగా పూర్తి చేయాలని, ఆలయ నిధులతో (రూ.5 కోట్ల కంటే తక్కువ ఖర్చు) నిర్మాణం చేపట్టిన భవనాలను ఈ ఏడాది కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించే 5వేల ఆలయాలను నిర్మాణం ప్రారంభించిన తేదీ నుంచి ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయాల్లో ఉద్యోగులందరికీ వెంటనే పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆలయాలు జారీచేసే ఉత్తర్వుల్లో కనీసం 50శాతం తెలుగులోనే ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలతో పాటు 6(ఏ) ఆలయాల్లో పరిపాలన మొత్తం ఈ-ఆఫీ్‌సలోనే నిర్వహించాలని సూచించారు. దేవదాయ శాఖకు చెందిన భూములు, ఆస్తుల రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, లీజులు, అద్దెలను మార్కెట్ విలువకు అనుగుణంగా క్రమం తప్పకుండా వసూలు చేయాలని కమిషనర్ నిర్దేశించారు.
క్యూలైన్లకు ఆనుకొని హుండీలు
భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాల్లో క్యూలైన్లకు అనుకొని స్టెయిన్‌లెస్ స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ బుధవారం మరో సర్క్యులర్ జారీ చేశారు. భక్తులు క్యూలైన్లలో నెమ్మదిగా వెళ్లడాన్ని నివారించేందుకు ఆలయాల్లో అవకాశం ఉన్నచోట వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు కానులు, ముడుపులు ప్రధాన హుండీలో వేసే క్రమంలో చాలావరకూ క్యూలైన్లు నెమ్మదిగా కదులుతున్నాయని తెలిపారు. అలాగే క్యూలైన్లు కనీసం రెండున్నర నుంచి మూడు అడుగుల వెడల్పు, నాలుగు నుంచి ఆరడుగులు ఎత్తు ఉండాలని పేర్కొన్నారు. హుండీల కొనుగోలు, క్యూలైన్ల ఏర్పాట్లకు టెండర్లు పిలవడంపై కమిషనర్ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు.