Share News

‘గూడెం’ గుండెల్లో సర్కారు బడి!

ABN , Publish Date - May 17 , 2026 | 05:18 AM

తల్లిదండ్రులంతా ప్రైవేటు స్కూళ్ల వైపు పరుగులు పెడుతుంటే.. ఆ ఊరి ప్రజలు మాత్రం సర్కారు బడే ముద్దు అంటున్నారు. ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల్లో..

‘గూడెం’ గుండెల్లో సర్కారు బడి!

  • ప్రైవేటు వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దంటున్న గ్రామస్థులు

  • నూరుశాతం సాధన.. ఫలించిన ఉపాధ్యాయుల కృషి

  • ఊళ్లోని 71 మంది విద్యార్థులూ ప్రభుత్వ బడుల్లోనే..

(నిడమర్రు-ఆంధ్రజ్యోతి)

తల్లిదండ్రులంతా ప్రైవేటు స్కూళ్ల వైపు పరుగులు పెడుతుంటే.. ఆ ఊరి ప్రజలు మాత్రం సర్కారు బడే ముద్దు అంటున్నారు. ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల్లో కలిగిం చిన నమ్మకం, గ్రామస్థుల అండ.. వెరసి ఆ పాఠశా లను ఉన్నతంగా నిలబెట్టాయి. ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న విధానంపై నమ్మకం కలిగిన తల్లిదండ్రులు.. చక్కని చదువు మన ఊరి బడిలోనే దొరుకుతుండగా ఇక ప్రైవేటు బడి ఎందుకని నిర్ణయించుకున్నారు. తమ ఊళ్లోకి ఏ ప్రైవేటు స్కూల్‌ బస్సునూ రానిచ్చేది లేదంటూ నిర్ణయి ంచుకుని పిల్లలను ప్రభుత్వ బడికే పంపిస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో ఈ విద్యాసంవత్సరంలో (2026-2027) ఐదేళ్లు నిండిన చిన్నారులు 8 మంది ఉండగా వీరందరిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించారు. అలాగే మరో 33 మంది చిన్నారులు ఇదే పాఠశాలలో రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు. గ్రామంలో ఆరు నుంచి పదో తరగతి చదివే మరో 30 మంది విద్యార్థులు సమీప కైకరం ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇలా గ్రామంలోని మొత్తం విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించడం గమనార్హం.


గ్రామస్థుల సంకల్పం.. ఉపాధ్యాయుల అంకితభావం

రామన్నగూడెం కొల్లేరు ప్రాంతంలోని గ్రామం కావడంతో గ్రామస్థులు, పెద్దలు తమ ఊరి బడిని కాపాడుకోవాలని సంకల్పించి ఊరిలోని చిన్నారులందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. ఇక్కడి టీచర్లు తోట రాజు, ఊడిమూడి సూరిబాబు అంకితభావంతో విద్యను బోధిస్తున్నారు. ప్రతినెలా పేరెంట్స్‌ మీటింగ్‌ పెట్టి పిల్లల సామర్థ్యాలను తెలియజేయడం వల్ల తల్లిదండ్రులకు పూర్తి నమ్మకం కలిగింది. పీటీఎంకు తల్లిదండ్రులంతా హాజరయ్యేలా చేయడంలో మొదటి విజయం సాధించామని ఆ ఉపాధ్యాయులు చెబుతున్నారు.


నాణ్యమైన విద్య అందిస్తున్నారు

ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయుల కృషి చేస్తున్నారు. ప్రతి నెలా జరిగే పేరెంట్స్‌ మీటింగ్‌లో మా పిల్లల టాలెంట్‌ మాకు తెలిసేలా చేస్తున్నారు. దాంతో గ్రామస్థులంతా, కలిసి ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం.

-సైదు వనజ, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌

మా బాధ్యత పెరిగింది

మా పాఠశాలలో ఉద యం 8 గంటలకు ప్రైవేటు క్లాస్‌లతో ప్రారంభించి సా యంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నాం. హోంవర్క్‌ కూడా స్కూల్లో చేయించడం వల్ల తల్లిదండ్రులకు మాపై నమ్మకం పెరిగింది. కాన్వెంట్‌ కన్నా మెరుగైన విద్య అందిస్తామని హమీ ఇవ్వడం వల్లే తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగి అడ్మిషన్లు పెరిగాయి. ఊరి పిల్లలందరూ బడిలో చేరడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. పేరెంట్స్‌ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటాం.

-తోట రాజు, ప్రధానోపాధ్యాయుడు,

రామన్నగూడెం ప్రాథమిక పాఠశాల

Updated Date - May 17 , 2026 | 05:24 AM