Sankranti Traditions: రంగుల హరివిల్లు
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:38 AM
సంక్రాంతి తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టే పండగ. కష్టపడిన రైతులను, వారికి సహకరించిన పశువులను గౌరవించుకునే సంప్రదాయం తెలుగు వారిదే.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఫైనల్స్ పోటీలు
జ్యోతి వెలిగించి ప్రారంభించిన బొండా సుజాత
ముఖ్యఅతిథిగా హాజరైన పొడపాటి తేజస్వి
విజేతలకు బహుమతుల ప్రదానం
విజయవాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘సంక్రాంతి తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టే పండగ. కష్టపడిన రైతులను, వారికి సహకరించిన పశువులను గౌరవించుకునే సంప్రదాయం తెలుగు వారిదే. చెట్టుకు మొక్కి, చీమకు చక్కెర, పాముకు పాలు పోసే సంస్కృతి మనదే!’’ అని రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సంస్థలు ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేస్తున్నాయంటూ ప్రశంసించారు. ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ నిర్వహించిన ‘సంతూర్ ముత్యాల ముగ్గు’ (పవర్డ్ బై: సన్‌ఫీ్‌స్ట మ్యాజిక్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగర్‌బత్తీ) ఫైనల్ పోటీలకు తేజస్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలను అభినందించి బహుమతులు అందించారు. శనివారం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫైనల్ పోటీలలో రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారితోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 30 మంది మహిళలు పాల్గొన్నారు. పోటాపోటీగా అందమైన రంగ వల్లులు తీర్చి దిద్దారు. అబ్బూరి రత్నలక్ష్మి, కొండ్రెడ్డి రమాదేవి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఒక్కో ముగ్గును నిశితంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన టి.నాగలక్ష్మి ప్రథమ బహుమతిని సాధించారు.

ఆమెకు రూ.30 వేల బహుమతిని అందజేశారు. కోనసీమ జిల్లాకు చెందిన మల్లేశ్వరి, చిత్తూరు జిల్లాకు చెందిన ఎ.సునీత, కర్నూలు జిల్లాకు చెందిన బి.వసంత, తమిళనాడుకు చెందిన కె.భార్గవి వేసిన ముగ్గులకు రెండో బహుమతి లభించింది. వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున అందజేశారు. మిగిలిన 25 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతిగా రూ.2 వేలు చొప్పున అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ సంతూర్, సన్‌ఫీస్ట్, పరిమళ్ మందిర్ వారి గిఫ్ట్ హ్యాంపర్లు అందించారు. శనివారం ఉదయం ఈ పోటీలను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సతీమణి బొండా సుజాత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముగ్గులు మహిళల్లోని ప్రతిభకు ఒక నిదర్శనమన్నారు. ఆకాశంలో ఉన్న చుక్కలను భువికి తీసుకొచ్చి ఒక వరుస క్రమంలో అమర్చినట్టుగా ముత్యాల ముగ్గులు వేస్తారని, వాటికి రంగులు అద్దితే మరింత ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు.
సంస్కృతిని చాటి చెప్పేలా...
ముగ్గుల పోటీ ఫైనల్స్‌లో వేసిన ముగ్గులు తెలుగు వారి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్నాయని ముఖ్యఅతిథిగా హాజరైన తేజస్వి పేర్కొన్నారు. ఈ ముగ్గులను తిలకించేందుకు పాఠశాల విద్యార్థులను తీసుకురావాలని, దీనివల్ల సంస్కృతీ సంప్రదాయాలను నేటితరం పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ ఏడాది నిర్వహించిన ముగ్గుల పోటీలకు సంబంధించిన విశేషాలను ‘ఆంధ్రజ్యోతి’ అసిస్టెంట్ ఎడిటర్ టి.సురేశ్ కుమార్ వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 81 కేంద్రాల్లో పోటీలు నిర్వహించగా, 12 వేల మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. అత్యధికంగా హిందూపురంలో 612 మంది, కనిగిరిలో 322 మంది మహిళలు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ వేమూరి మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్, సర్క్యులేషన్, అడ్వర్టైజ్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.