Share News

రైతన్నలకు డబుల్‌ బొనాంజ

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:45 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు డబుల్‌ బొనాంజ ఇవ్వనున్నాయి.

రైతన్నలకు డబుల్‌ బొనాంజ

పీఎం కిసానతో పాటు అన్నదాత సుఖీభవ అమలు

రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు డబుల్‌ బొనాంజ ఇవ్వనున్నాయి. ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన 22వ విడత రూ.2వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత రూ.4వేలు కూడా అందాల్సి ఉంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి బుధవారం అధికారిక ప్రకటన విడుదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేయాలని జారీ చేసిన ఆదేశాలు వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి అందాయి. కర్నూలు జిల్లాలోని మొత్తం 2,72,757 మంది రైతుల ఖాతాల్లో రూ.154.94 కోట్లు జమ చేస్తారని జేడీ వరలక్ష్మి తెలిపారు. రైతులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను నిరంతరంగా పొందేందుకు తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు పాటించాలని కోరారు. ఈ పథకం అమలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని జేడీ రైతులను కోరారు.

Updated Date - Mar 11 , 2026 | 11:45 PM