Share News

ట్రాఫిక్‌ పోలీసులకు భయపడి రాంగ్‌రూట్‌లోకి..

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:26 AM

ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహానికి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి బలయ్యాడు. చలానాలు వేస్తున్నారన్న కంగారులో ఆ విద్యార్థి డివైడర్‌ వైపునకు రాంగ్‌రూట్‌లో వెనక్కి తిరగడంతో...

ట్రాఫిక్‌ పోలీసులకు భయపడి రాంగ్‌రూట్‌లోకి..

  • మినీవ్యాన్‌ను ఢీకొని ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

  • ప్రాణాలతో బయటపడ్డ మృతుని సోదరుడు

గన్నవరం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహానికి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి బలయ్యాడు. చలానాలు వేస్తున్నారన్న కంగారులో ఆ విద్యార్థి డివైడర్‌ వైపునకు రాంగ్‌రూట్‌లో వెనక్కి తిరగడంతో ట్రాఫిక్‌ పోలీసు పట్టుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాలోని కేసరపల్లికి చెందిన పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు పలగాని శివాజీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రణయ్‌ (22) కేఎల్‌యూలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు కౌశిక్‌ ఇంటర్‌ సెకండియర్‌ విజయవాడలో చదువుతున్నాడు. శనివారం సాయంత్రం కౌషిక్‌ను ట్యూషన్‌లో దింపేందుకు ప్రణయ్‌ ద్విచక్ర వాహనంపై పెద్ద అవుటపల్లి వైపు వెళ్లాడు. చినఅవుటపల్లి సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు రాస్తున్నారు. అటువైపే వెళ్తున్న ప్రణయ్‌ ట్రాఫిక్‌ పోలీసులను చూసి వన్‌వేలోనే వాహనాన్ని వెనక్కి తిప్పాడు. దీంతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పట్టుకునే ప్రయత్నం చేశాడు. వారిని తప్పించుకుని వెళ్లే కంగారులో ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను ఢీకొట్టి ఇద్దరూ కింద పడిపోయారు. కౌశిక్‌ స్వల్వ గాయాలతో ప్రాణాలతో బయటపడగా, తీవ్ర గాయాలైన ప్రణయ్‌ను పిన్నమనేని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహంతోనే ప్రణయ్‌ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపించారు. కాగా, ప్రణయ్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌ లేనందున ట్రాఫిక్‌ పోలీసులు ఆపి ఫైన్‌ వేస్తారనే భయంతో, వెనక్కి తిప్పి రాంగ్‌రూట్‌లోకి మినీ వ్యాన్‌ను ఢీకొని పడిపోయాడని ఆత్కూరు ఎస్‌ఐ లక్ష్మి నరసింహమూర్తి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 04:27 AM