Guntur: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మాహుతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:18 AM
గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మాహుతి చేసుకున్నాడు.
పెట్రోల్ పోసుకుని.. నిప్పంటించుకుని అఘాయిత్యం
గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాల ఆవరణలోనే ఘటన
చేబ్రోలు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మాహుతి చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన నల్లూరి రాఘవేంద్ర వెంకట్(21) స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కళాశాలకు వచ్చిన వెంకట్ మధ్యాహ్న సమయంలో కళాశాల ఆవరణలోని మరుగుదొడ్ల వైపు వెళ్లాడు. బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు, పొగలు రావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన వెంకట్‌ను గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ముద్దుకృష్ట ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు ఎస్‌ఐ వీరనారాయణ తెలిపారు.