ఉపాధి ‘నాణ్యత’కు ఇంజనీర్ల కొరత
ABN , Publish Date - May 18 , 2026 | 04:31 AM
ఉపాధి హామీ పథకంలోని కీలకమైన నాణ్యతా విభాగానికి ఇంజనీర్ల కొరత ఏర్పడింది. గత రెండేళ్లుగా ఈ విభాగానికి డిప్యూటేషన్‌పై ఇంజనీర్లు రాకపోవడంతో పనుల తనిఖీలు నత్తనడకన సాగుతున్నాయి.
9 జిల్లాల్లో ఖాళీలు.. పట్టని తనిఖీలు
ఉన్నవారికే పని.. డిప్యుటేషన్‌కు నో
పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలకు లేఖ రాసిన కమిషనర్
నత్తనడకన కాలనీల లెవెలింగ్ తనిఖీ
ఇదే అదునుగా బిల్లుల కోసం వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించిన వైనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకంలోని కీలకమైన నాణ్యతా విభాగానికి ఇంజనీర్ల కొరత ఏర్పడింది. గత రెండేళ్లుగా ఈ విభాగానికి డిప్యూటేషన్‌పై ఇంజనీర్లు రాకపోవడంతో పనుల తనిఖీలు నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాదు, జిల్లాల్లోని సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులకు రెండు నుంచి మూడు జిల్లాల పనులను అదనంగా అప్పగిస్తున్నారు. దీంతో ఉన్నవారిపైనే భారం పడటంతో తనిఖీలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఏడాది నుంచి జగనన్న కాలనీల లెవలింగ్ పనుల తనిఖీలకు సంబంధించి 50 శాతం కూడా పూర్తి కాలేదు. కొన్ని జిల్లాల్లో తనిఖీలు నామమాత్రంగా చేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు చెల్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే అదనుగా అప్పట్లో జగనన్న కాలనీ లెవలింగ్ పనులు చేసిన వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి బిల్లుల చెల్లింపుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు.. సిబ్బంది కొరత వల్ల చేసిన పనుల్లో ఎలాంటి తేడాల్లేవంటూ తనిఖీలు చేయకుండానే బిల్లులు చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఉపాధి పథకంలో 10 శాతం పనులే క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేస్తోంది. వాస్తవానికి ఈ పనులను ర్యాండమ్‌గా ఎంపిక చేసి తనిఖీలు నిర్వహించాలి. సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పాటు జిల్లాల్లో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా కొరత ఏర్పడటంతో తనిఖీలు ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు.
9 జిల్లాల్లో ఖాళీలు..
రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 9 సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్రంలో నలుగురు సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులే పనిచేస్తున్నారు. దీంతో పాటు ఆరు జిలాల్లో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా పంచాయతీరాజ్‌శాఖ, భూగర్భజల వనరుల ఇంజనీర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తుంటారు. గతంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు పదోన్నతుల కోసం ‘డీపీసీ’ ఏర్పాటు చేసినప్పుడు కూడా సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల ఖాళీలు గ్రామీణాభివృద్ధిశాఖలో చూపించి పదోన్నతులు పొందారు. ఇప్పుడు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల్లోనూ ఇంజనీర్ల కొరత ఉండటంతో క్వాలిటీ కంట్రోల్ విభాగానికి డిప్యూటేషన్‌పై రావడానికి ఎవరూ మొగ్గుచూపడం లేదు.
రిటైర్డ్ అధికారుల విషయంలో..
ఉపాధి క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఇంజనీర్ల కొరతతో రిటైర్డ్ ఇంజనీర్లను డిప్యూటేషన్‌పై తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సిద్ధమయ్యారు. కానీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల కమిషనర్ కృష్ణతేజ ఇటీవల ఈ విషయాన్ని పక్కన పెట్టారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీ్‌ఫలకు సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కావాలని లేఖలు రాశారు. డిప్యూటేషన్‌పై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను పంపాలని కోరారు. ఆయా శాఖల్లోనూ సిబ్బంది కొరత ఉండటంతో ఇంజనీర్లను సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది.