దేవదాయంలో ‘మెమో’ వివాదం!
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:27 AM
దేవదాయ శాఖలో మెమోల వివాదం నడుస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగులకు, పదోన్నతులు పొందిన వారికి మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు కూడా వేసుకున్నారు.
అక్రమ పదోన్నతులపై 2000లో జీవో 888 జారీ
జీవోకు విరుద్ధంగా ప్రమోషన్లు
నిబంధనలు పాటించాల్సిందేనంటూ 2015లో మెమో
అప్పటినుంచే జీవో వర్తిస్తుందని తాజాగా ఉత్తర్వు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దేవదాయ శాఖలో మెమోల వివాదం నడుస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగులకు, పదోన్నతులు పొందిన వారికి మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు కూడా వేసుకున్నారు. ఇలాంటి సమయంలో శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ హరిజవహర్ లాల్ తాజాగా ఇచ్చిన మెమో తీవ్ర వివాదాస్పదమైంది. దేవదాయ శాఖలో అక్రమ పదోన్నతులను కట్టడికి 2000లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో 888 జారీ చేసింది. దీని ప్రకారం.. ఉద్యోగి ఏ ఆలయంలో విధుల్లో చేరితే అక్కడే పదోన్నతి తీసుకోవాలి. విధుల నిమిత్తం మరో ఆలయానికి వెళ్లినా అక్కడ ప్రమోషన్ తీసుకోవడానికి వీల్లేదు. అయితే చాలామంది కమిషనర్లు ఆ జీవోకు విరుద్ధంగా కొందరు ఉద్యోగులకు మాతృ ఆలయంలో కాకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పదోన్నతులు కల్పించారు. దీనిపై తొలినుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతునే ఉన్నాయి. అయినా కూడా ఏ కమిషనర్ కూడా జీవోను పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. అయితే 2015లో దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన జేఎస్వీ ప్రసాద్... పదోన్నతుల విషయంలో జీవో 888ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ మెమో 18216 జారీ చేశారు. అప్పటి వరకూ అక్రమంగా పదోన్నతులు పొందిన వారికి రివర్షన్ ఇవ్వాలని, వారికి ప్రమోషన్ ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా ఈ మెమోను సమీక్షించిన హరిజవహర్ లాల్.. జీవో 888 విడుదలైన తేదీ నుంచి కాకుండా 2015 నుంచి అమల్లోకి వస్తుందనే సారాంశంతో ఈ నెల 8న మెమో 968ను జారీ చేశారు. దీనిద్వారా 2000 నుంచి 2015 వరకూ అక్రమంగా పదోన్నతులు పొందిన వారందరికీ ఆయన క్లియరెన్స్ ఇచ్చినట్లయింది. దీనిపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ 15 ఏళ్లలో కొన్ని వందల మంది అక్రమ పదోన్నతులు పొందారు. కొందరి మేలుకే ఈ మెమో ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.
మెమో చెల్లుబాటుపై సందేహాలు
వాస్తవానికి జీవో 888ను ప్రభుత్వం 2000 డిసెంబరు 8న జారీ చేసింది. ఆ రోజు నుంచే అందులోని నిబంధనలు అమలులోకి వస్తాయి. జీవోలోని నిబంధనలను ఒక చిన్న మెమో ద్వారా మార్చడం కుదరదు. పైగా సెక్రటరీ లేదా కమిషనర్ స్థాయి అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులకు మద్దతుగానే మెమోలు జారీ చేయాలి. కానీ వ్యతిరేకంగా ఇచ్చే అధికారం వారికి ఉండదు. ఈ నేపథ్యంలో ఇది చెల్లుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు అక్రమ పదోన్నతుల అంశం హైకోర్టులో ఉంది. ఈ సమయంలో మెమో ఇవ్వడం అభ్యంతరకరంగా మారింది. ఈ మెమోను సవాల్ చేస్తూ కొంతమంది ఈవోలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సర్కారును కోరుతున్నారు.