Share News

అంతులేని నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:23 AM

జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. ఉన్నతాధికారులైతే మరీ దారుణం.

   అంతులేని నిర్లక్ష్యం

తీరు మారని వైద్యారోగ్య శాఖ

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలో బట్టబయలు

మారని తిమ్మాపురం పీహెచసీ ఉద్యోగులు తీరు

ఫీల్డ్‌కు వెళ్లినట్లు మూమెంట్‌ రిజిస్టర్‌లో ఫోర్జరీ సంతకాలు

స్పెషల్‌ ఆఫీసర్‌ తనిఖీలోనూ ఇదే దుస్థితి

క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

అడిషనల్‌ డీఎంహెచవోకు ఇనచార్జి బాధ్యతలు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

నంద్యాల, ఏప్రిల్‌15(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. ఉన్నతాధికారులైతే మరీ దారుణం. అదును చూసి అందిన కాటికి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తద్వారా ఆశాఖ ఉద్యోగులు కూడా ఇదే అదును భావించి ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించడం పరిపాటిగా మారిందని స్పష్టం గా తెలుస్తోంది. ఇటీవల తిమ్మాపురం పీహెచసీపై స్పెషల్‌ ఆఫీసర్‌ తనిఖీలతో పాటు బుధవారం కలెక్టర్‌ రాజకుమారి ఆకస్మిక తనిఖీలోనూ పలువురు ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టి గైర్హాజరయ్యారని తేలింది. మూమెంట్‌ రిజిస్టర్‌లో సైతం ముగ్గురు ఉద్యోగులు ఫీల్డ్‌కు వెళ్లినట్లు అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి వారు చేసినట్లుగా సంతకాలు చేయడం చూసి కలెక్టర్‌ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వీళ్లు మారరా? అని ఆగ్రహాం వ్యక్తం చేశారంటే వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్‌ ఆయా వైద్యులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. పూర్థిస్థాయిలో విచారణ చేసి వారిని సస్పెండ్‌ చేస్తారా? లేక తాత్కాలిక చర్యలతో సరిపెడతారా? అనే చర్చ ఆశాఖ ఉద్యోగులతో పాటు పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్‌ మీడియాలోను ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

పనితీరుపై పలు రూపాల్లో..

ఇటీవల వివిధ పత్రికల్లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై పలు రూపాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈనెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ‘పైసా వసూల్‌..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీం తో ఆశాఖ అధికారులు, ఉద్యోగుల్లో ఆలజడి రేపినట్లైంది. కలెక్టర్‌ సైతం కథనంలోని పలు అంశాలపై డీఎంహెచవో ఆరాతీసి సమగ్ర వివరణ ఇవ్వాలని అదేశించినట్లు సమాచారం. ఇదంత పక్కనబెడితే.. ఇంతలోనే ఏం జరిగిందో? ఏమో కానీ కలెక్టర్‌ సైతం గతంలో తిమ్మాపురం పీహెచసీపై స్పెషలాఫీసర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం ఆకస్మిక తనిఖీ వెళ్లడంతో మరోమారు పరిస్థితి బట్టబయలైంది. ఈ క్రమంలో ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టారు. దీనిపై చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ అబ్బిపురం సచివాలయంలో ఉండగా.. ఇద్దరు వైద్యులు హూటాహూటిన అక్కడ ప్రత్యక్షమవుడంతో వారిపై ఆగ్రహ్యం వక్తంచేశారు.

ఐదుగురు ఉద్యోగుల్లో..

విధులకు గైర్హాజరైన ఉద్యోగుల్లో ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన, ఒక ఫార్మసిస్ట్‌ ఉన్నారు. మరో ఎంపీహెచఈవో( పోర్జరీ చేసిన ఉద్యోగి) ఉన్నారు. స్పెషలాఫీసర్‌ తనిఖీ నివేదికలో సదరు వైద్య ఉద్యోగుల వ్యవహరం నెగిటివ్‌గా ఉండటంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆయినా వారిలో మార్పురాలేదు. కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీనే ఇందుకు నిదర్శనం.

సెలవులో డీఎంహెచవో?

‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘పైసా వసూల్‌..’ కథనం ఆశాఖ ఉద్యోగుల్లో, అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్‌ సైతం లోతుగా ఆరాతీసి నివేదిక కోరినట్లు సమాచారం. తాజా తిమ్మాపురం పీహెచసీ తనిఖీతో ఆశాఖ ఉద్యోగుల్లో ఆలజడి మొదలైంది. ఉన్నఫలంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి(డీఎంహెచవో) వెంకటరమణ 15 రోజుల పాటు సెలవులో వెళ్లినట్లు సమాచారం. దీంతో అడిషనల్‌ డీఎంహెచవో శారదాబాయ్‌కి ఇనచార్జి బాధ్యతలు అప్పగించారని తెలిసింది. ఏదిఏమైనా ఆశాఖ ఉద్యోగుల్లో మాత్రం ఒకవైపు అలజడి.. మరోక వైపు కొంత ఊరట కలిగినట్లైందని చర్చ సాగుతోంది.

Updated Date - Apr 16 , 2026 | 12:23 AM