Share News

బట్టమేక.. నువ్వెక్కడ?

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:46 AM

పొడవాటి తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు, నలుపు ఈకల హారం.. గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీ ఆకారంతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) పక్షుల సొంతం.

బట్టమేక.. నువ్వెక్కడ?

  • కనుమరుగవుతున్న అరుదైన పక్షిజాతి

  • 1989నాటికి రాష్ట్రంలో 150 గుర్తింపు

  • నంద్యాల జిల్లా రోళ్లపాడు స్థావరం

  • సంరక్షణకు అభయారణ్యం ఎంపిక..

  • చివరగా 2020లో కనిపించిన బట్టమేక

  • ప్రస్తుతం వాటి జాడే లేని వైనం

  • దేశవ్యాప్తంగా తగ్గిపోయిన సంఖ్య

  • సంరక్షణకు శ్రీకారం చుట్టిన అటవీశాఖ

(ఆత్మకూరు-ఆంధ్రజ్యోతి)

పొడవాటి తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు, నలుపు ఈకల హారం.. గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీ ఆకారంతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) పక్షుల సొంతం. విమానం తరహాలో నేలపై పరుగులు తీసి.. గాల్లోకి లేచి స్థిమితంగా, లయబద్దంగా విశాలమైన రెక్కలను కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత. ప్రపంచంలోనే అరుదైన పక్షిజాతుల్లో బట్టమేక పక్షి ఒకటి. దీని శాస్ర్తీయ నామం ఆర్డియోటీస్‌ నైగ్రిసెప్స్‌. మనదేశంలోనూ ఈ పక్షులు అంతరించిపోయే స్థితికి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వీటి జాడ కనిపించడం లేదు. 2008 నాటికి ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో 300లోపు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కి పడిపోయినట్లు తెలుస్తోంది. అందులోనూ.. ఎక్కువ పక్షులు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా బట్టమేక పక్షిజాతులు ఉండగా.. మనదేశంలోనే 4 జాతులు ఉన్నాయి. ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉన్నవి అరుదైన జాతికి చెందినవి.


నాడు 150 పక్షులు.. నేడు జాడే కరువు

రాష్ట్రంలో బట్టమేక పక్షి ప్రధాన స్థావరంగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని గుర్తించారు. 1979లో బాంబే రీసెర్చ్‌ వారు బట్టమేక ప్రాధాన్యాన్ని గుర్తించారు. ప్రముఖ పక్షిజాతి శాస్త్రవేత్త సలీం అలీ 1980లో రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. 1988లో సుమారు 927 హెక్టార్లలో అభయారణ్యాన్ని ఎంపిక చేశారు. 1989లో అక్కడ 150 బట్టమేక పక్షులు ఉన్నట్లు గుర్తించారు. చివరగా 2020లో ఒక పక్షి కనిపించింది. ప్రస్తుతం వాటి జాడే లేదు.

రైతన్నలకు తోడుగా..

జనసంచారం లేని గడ్డి మైదానాల్లో, వ్యవసాయ యోగ్యమైన పొలాల్లో ఇవి సంచరిస్తుంటాయి. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తిని రైతన్నలకు తోడుగా నిలుస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తాయి. అరుదుగా గుంపుగా మేస్తూ కనిపిస్తాయి. వివిధ పంటల కోత తర్వాత మిగిలిన మోములు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు తదితర వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి.


ఏడాదికి ఒక గుడ్డే..

బట్టమేక పక్షుల సంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతుంది. ఈ జాతి పక్షులు ఆడ, మగవి జతకట్టి సంచరించవు. మగ పక్షి, ఆడపక్షి ఎదురైన సందర్భంలోనే ఇవి కలుస్తాయి. సాధారణంగా మార్చి, సెప్టెంబరు మధ్య కాలంలో గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడపక్షి ఏడాదికి కేవలం ఒక గుడ్డు మాత్రమే పెట్టి, దట్టమైన పొదల్లో 25 నుంచి 30 రోజుల వ్యవధిలో పొదుగుతుంది. ఒక్కోసారి అరుదుగా రెండు గుడ్లు కూడా పెడతాయి. ఒక్కో ఆడపక్షి తన జీవితకాలంలో కేవలం ఐదారు గుడ్లు పెడతాయి. వీటి సగటు జీవిత కాలం సుమారు 15-16 ఏళ్లు. ఈ పక్షులు అత్యంత బలిష్టమైనవి. మీటరు పొడవు, 15-18 కిలోల బరువు, రెక్కల పొడవు 210 నుంచి 250 సెంటిమీటర్లు, అలాగే పొడవాటి మెడను కలిగి ఉంటాయి. నిర్దిష్టమైన ఎత్తులో మాత్రమే ఇవి విహరిస్తాయి.

Untitled-3 copy.jpg


కృత్రిమ గర్భధారణపైనే ఆశలు

వైల్ట్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా బస్టర్డ్‌ రికవరీ ప్రోగ్రామ్‌లో భాగంగా 2018లో తొలిసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో బట్టమేక పక్షి కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2024లో కృత్రిమ గర్భధారణ వల్ల మొదటిసారిగా ఒక ఆడపక్షి పుట్టింది. ఈ విధానంతో రోళ్లపాడు అభయారణ్యంలో బట్టమేక పిల్లలను పుట్టించి, గడ్డి మైదానాల్లో వదలాలని అటవీ శాఖ భావిస్తోంది.

మారిన పరిస్థితులు

రోళ్లపాడు అభయారణ్యం పరిసరాల్లో ఒకప్పుడు గడ్డిభూములు అధికంగా బట్టమేక పక్షుల సుస్థిరమైన ఆవాసానికి కీలకంగా ఉండేవి. అదేక్రమంలో అక్కడి వ్యవసాయ భూముల్లో కూడా రైతులు వేరుశనగ పంటను విస్తారంగా సాగుచేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రోళ్లపాడు పరిసర మైదాన ప్రాంతాల్లో విండ్‌ ఎనర్జీ కోసం గాలిమరలు, వందలాది ఎకరాల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా విద్యుత్‌ లైన్లను అమర్చారు. అలాగే కొంతకాలంగా వేరుశనగ పంటకు బదులు మొక్కజొన్న పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఇందుకు రసాయన, క్రిమిసంహారక మందులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక వేటగాళ్ల ఉచ్చులతో పాటు గడ్డిభూముల్లో పాడిపశువులు, మనుషుల సంచారం అధికమైంది. దీనివల్ల గడ్డిమైదానాలు క్షీణిస్తున్నాయి. ఇవి బట్టమేక పక్షి ఆవాసానికి ఆటంకాలుగా మారాయి. దీంతో వాటి ఆచూకీ లేకుండా పోయాయని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాయని అటవీ అధికారులు భావిస్తున్నారు.


సంరక్షణకు చర్యలు

రోళ్లపాడు అభయారణ్యంలో బట్టమేక పక్షుల ఉనికిని తిరిగి సుస్థిర పరిచేందుకు అటవీ శాఖ తరఫున అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నాం. ఇక్కడ బట్టమేక పక్షి ఉనికి లేకపోవడంతో గుడ్లను సేకరించి కృత్రిమ గర్భధారణ ద్వారా వృద్ధి చేయాలని భావిస్తున్నాం. అదేక్రమంలో రోళ్లపాడు అభయారణ్యంలో గడ్డి నెమలి (లెసర్‌ ప్లోరికన్‌)ని గుర్తించాం. బట్టమేక పక్షులను సంరక్షిస్తే గడ్డి నెమళ్ల సంతతి కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది.

Untitled-3 copy.jpg

- విఘ్నేష్‌ అప్పావ్‌, డిప్యూటీ డైరెక్టర్‌, ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌

Updated Date - Jan 25 , 2026 | 04:47 AM