Share News

Weather Alerts: ముగిసిన ‘ఈశాన్య’ సీజన్‌

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:11 AM

ఈశాన్య రుతుపవనాల సీజన్‌ సోమవారంతో ముగిసింది. గడచిన రెండు రోజుల నుంచి దక్షిణ భారతంలో వర్షాలు నమోదుకాలేదు.

Weather Alerts: ముగిసిన ‘ఈశాన్య’ సీజన్‌

  • నేడు, రేపు పలు జిల్లాల్లో పొగమంచు

  • ఉదయం 10 వరకు వాహనాలు

  • జాగ్రత్తగా నడపాలని సూచన

విశాఖపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల సీజన్‌ సోమవారంతో ముగిసింది. గడచిన రెండు రోజుల నుంచి దక్షిణ భారతంలో వర్షాలు నమోదుకాలేదు. అదే సమయంలో ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ(ఐఎండీ)...ఐదు వాతావరణ సబ్‌ డివిజన్ల(తమిళనాడు-పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటక)లో ఈశాన్య రుతుపపవనాల సీజన్‌ ముగిసినట్టు ప్రకటించింది. సాధారణంగా అక్టోబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకూ ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. కొన్ని వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీజన్‌ ముగింపుపై అధికారిక ప్రకటన చేస్తారు. అక్టోబరు ఒకటి నుంచి డిసెంబరు నెలాఖరు వరకు ఏపీలో 287.2 మి.మీ.కు గాను 357.6 మి.మీ.(సాధారణం కంటే 25 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది.


కొనసాగుతున్న మంచు, చలి

ఒడిశా పరిసరాల్లో అధిక పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం పొడి వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగమంచు కురిసింది. అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగింది. మంగళ, బుధవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఉదయం పది గంటల వరకూ వాహనాలు నెమ్మదిగా నడపడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పొగమంచు కారణంగా 9 విమానాలు రద్దు

గన్నవరం విమానాశ్రయంలో సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. విమానాలు దిగేందుకు విజిబిలిటీ లేకపోవటంతో 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజూ ఉదయం చెన్నై నుంచి గన్నవరం వచ్చి వైజాగ్‌ వెళ్లే ఇండిగో విమానం రద్దయ్యింది. ఇదే విమానం వైజాగ్‌ నుంచి గన్నవరం వచ్చి తిరుపతి వెళుతుంది. హైదరాబాద్‌ నుంచి గన్నవరం వచ్చి వెళ్లే ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చి తిరిగి వెళ్లే ఎయిరిండియా విమానం, బెంగళూరు నుంచి గన్నవరం వచ్చి వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, వైజాగ్‌ నుంచి గన్నవరం వచ్చే ఇండిగో విమానాలు రద్దైనట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 04:12 AM