Share News

విశాఖలో రఘురామ స్థలం ఆక్రమణ

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:41 AM

విశాఖపట్నంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇంటి స్థలం ఆక్రమణకు గురైంది. అందులో ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపట్టారు.

విశాఖలో రఘురామ స్థలం ఆక్రమణ

  • ప్రహరీ గోడ కూడా నిర్మాణం.. పోలీసులకు డిప్యూటీ స్పీకర్‌ ఫిర్యాదు

విశాఖపట్నం, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇంటి స్థలం ఆక్రమణకు గురైంది. అందులో ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపట్టారు. ఈ విషయం మిత్రుడి ద్వారా తెలుసుకున్న రఘురామ 20న పోతినమల్లయ్యపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రుషికొండ ఐటీసెజ్‌కు సమీపంలో ఉన్న మారుతీనగర్‌లో సర్వే నం. 374/1లో 1988లో వేసిన ప్రైవేట్‌ లేఅవుట్‌లోని 333.33 గజాల 11వ నంబరు హెచ్‌ఐజీ ప్లాట్‌ను రఘురామ 1989లో కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ నం. 6725/1989తో డాక్యుమెంట్‌ ఉంది. భూపతిరాజు నరసింహరాజు, చేకూరి అప్పలనరసమ్మల నుంచి రఘురామ కొనుగోలు చేశారు. ఆ సమయానికి మధురవాడలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం లేదు. విశాఖలోని సూపర్‌ బజార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేశారు. ఈ ప్లాట్‌ను 2001లో గణపతిరాజు సాయిభాస్కర్‌కు దంతులూరి సత్యనారాయణమ్మ విక్రయించారు. ఈ డాక్యుమెంట్‌ నం.1480/2001. తరువాత మళ్లీ ఇదే ప్లాటును 2021లో గిఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ కింద గణపతిరాజు సుధ నుంచి వారసులైన గణపతిరాజు శ్రావణ్‌, గణపతిరాజు కిరణ్‌కు రిజిస్టర్‌ చేశారు. ఈ డాక్యుమెంట్‌ నం.2311/2021. ఒకే స్థలంపై రెండు సేల్‌ డీడ్లు, ఒక గిఫ్ట్‌ డీడ్‌ జరిగాయి. ఈ స్థలం విలువ ఇప్పటి మార్కెట్‌ ధర ప్రకారం రూ.2కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఫోర్జరీ చేశారని భావిస్తున్నాం

డిప్యూటీ స్పీకర్‌ స్థలాన్ని 1989లో కొనుగోలు చేశారు. ఆ మరుసటి నెలలోనే దానిని వేరే వారు కొనుక్కున్నట్టు డాక్యుమెంట్‌ సృష్టించి రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిసింది. అయితే తాను ఎవరికీ స్థలం అమ్మలేదని డిప్యూటీ స్పీకర్‌ చెబుతున్నారు. ఆ తరువాత దానిపై మరో రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఫోర్జరీ చేశారని భావిస్తున్నాం. విచారణ కొనసాగుతోంది.

- బాలకృష్ణ, సీఐ, పీఎం పాలెం

Updated Date - Jun 27 , 2026 | 04:42 AM