‘ఉపాధి’ అక్రమార్కులకు చెక్!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:54 AM
ఉపాధి హామీ మెటీరియల్ నిధులు రూ.20 కోట్ల స్వాహా యత్నానికి అధికారులు చెక్ పెట్టారు. జూలై 6న ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఒకే ఒక్కడు రూ.20 కోట్లకు టెండర్!’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఉపాధి పథకం సోషల్ ఆడిట్ డైరెక్టర్, నెల్లూరు డ్వామా పీడీలను దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడింది
సమగ్రశిక్ష కింద ప్రహరీల నిర్మాణం
పేరుతో 20 కోట్ల స్వాహాకు యత్నం
వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
పీఆర్ కమిషనర్ ఆదేశాలతో చర్యలు
నెల్లూరులో సొమ్ము రికవరీ
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ మెటీరియల్ నిధులు రూ.20 కోట్ల స్వాహా యత్నానికి అధికారులు చెక్ పెట్టారు. జూలై 6న ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఒకే ఒక్కడు రూ.20 కోట్లకు టెండర్!’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఉపాధి పథకం సోషల్ ఆడిట్ డైరెక్టర్, నెల్లూరు డ్వామా పీడీలను దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తప్పుడు రికార్డులు సృష్టించి రూ.20 కోట్లకు పైగా బిల్లులు చేసి, నిధుల కోసం అక్రమార్కులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రూ.2.41 కోట్లను ఆయా అకౌంట్లకు మళ్లించుకున్నారు. నెల్లూరు డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డ్వామా అధికారులు ఆయా అకౌంట్లకు మళ్లించిన సొమ్ము రికవరీకి ప్రయత్నించారు. దీంతో ఇప్పటివరకు రూ.1.09 కోట్లు రికవరీ అయ్యాయి. మిగిలిన మొత్తం చెల్లించాలని అక్రమార్కులపై ఒత్తిడి పెంచారు. దీంతోపాటు తప్పుడు బిల్లులు, తప్పుడు ఎంబుక్‌లతో రికార్డు చేసిన రూ.20 కోట్ల బిల్లులను నిర్వీర్యం చేశారు. నిధులను చాకచక్యంగా రికవరీ చేసిన నెల్లూరు డ్వామా అధికారులను కమిషనర్ కృష్ణతేజ అభినందించారు.
జరిగిందిలా.....
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, రాపూరు, దగదర్తి, చిల్లకూరు, గూడూరు, కోవూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్ మండలాల్లో పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణాలు చేపట్టేందుకు నెల్లూరు సమగ్రశిక్ష కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి నకిలీ మంజూరీలు సృష్టించాడు. ఆయా మండలాల్లో సుమారు రూ.20 కోట్ల మేర ప్రహరీ గోడల నిర్మాణాలు ఉపాధి మెటీరియల్ నిధులతో చేపట్టేందుకు కలెక్టర్ పనులు మంజూరు చేసినట్లు ఫేక్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్‌లు పుట్టించారు. నిర్మాణాలు చేపట్టకుండానే ఎంబుక్‌లు రికార్డు చేశారు. ఆ ఎంబుక్‌లపై ఇంజనీర్ల సంతకాలు ఫోర్జరీ చేశారు. ఉపాధి పథకానికి ప్రోగ్రాం అధికారిగా ఉన్న ఎంపీడీఓల లాగిన్‌లోకి జొరబడి చెల్లింపులు కూడా చేసేశారు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఆ ఉద్యోగికి సహకరించారు.
చేతులు దులుపేసుకున్న సమగ్రశిక్ష
సమగ్ర శిక్ష పేరుతో ఆ శాఖలో పనిచేసే ఉద్యోగి ఉపాధి హామీ మెటీరియల్ నిధులు దోచుకునేందుకు పావులు కదిపితే సమగ్ర శిక్ష అధికారులు ఆ కాంట్రాక్టు ఉద్యోగిని తొలగించి, తమ శాఖలో ఎలాంటి తప్పులు జరగలేదని చేతులు దులుపుకున్నారు. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మాత్రం దీనికి కారణమైన కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకుంది. మరికొంతమందిపై వేటుకు రంగం సిద్ధం చేసింది. పూర్తి సొమ్ము రికవరీ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.