తూతూ మంత్రంగా ‘ఉపాధి’ ప్రజావేదిక
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:35 AM
స్థానిక ఎంపీడీవో ఆవరణలో మంగళవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది.
రూ. 14.09 కోట్లలో పనులు
రూ. 1.64 లక్షల రికవరీకి ఆదేశాలు
సిబ్బంది తప్ప జనం లేని ప్రజావేదిక
గోనెగండ్ల, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యో తి): స్థానిక ఎంపీడీవో ఆవరణలో మంగళవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది. కార్యక్రమానికి డ్వామా పీడీ మాధవీలత , అడిషినల్ పీడీ లోకేశ్వర్ హాజరయ్యారు. ఉపాధి హామీ చట్టంలో భాగంగా మండలంలోని పంచాయతీలలో ఏప్రిల్ 1 2024 నుంచి 2025 వరకు జరిగిన పనులకు 19వ విడత సామాజిక తనిఖీ బృందం సిబ్బంది తనిఖీ చేశారు. ఉపాధి తనిఖీ ప్రజావేదికు అధికారులు, ఉపాధి సిబ్బంది తప్ప జనం రాలేదు. తనిఖీపై సర్వే జరుగుతున్న విషయాన్ని కూడా గోప్యంగా ఉంచి నివేదికలు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన పనులకు సంబంధించి తనిఖీలో గుర్తించిన అంశాలపై మంగళవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ ఏడాది 1357 పనులు గుర్తించారు. అందులో ఎనఆర్‌ఈజీఎ్‌స కింద 1250 పనులు, పీఆర్ కింద 94పనులు, హౌసింగ్ కింద 3 పనులు, అటవీశాఖ పనుల కింద 3, సర్వశిక్షాఅభ్యాన కింద 1 పనిని, గుర్తించారు. ఇందుకు సంబందించి కూలీలు, మెటీరియల్ కింద మొత్తం కలిపి రూ.14,09,కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వారం రోజులుగా తనిఖీ బృందం 28 గ్రామాలలో పర్యటించింది. కూలీలను, ఆయా గ్రామాలలో జరిగిన పనులను పరిశీలించారు. ఎక్కడ అవినీతి జరిగింది అనే కోణంలో తనిఖీ చేశారు. పెనాల్టి కింద రూ.62వేలు వేశారు. మొత్తం రూ.1.64 లక్షలు... వీటిని ఉపాధి అధికారులు ఫీల్డ్‌అసిస్టెంట్ నుంచి రికవరీ చేయాల్సి ఉంది. కాగా ప్రజావేదికలో అధికారులు, ఉపాధి సిబ్బంది తప్ప జనం లేక పోవడం పట్ల పలువురు విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో అంబడ్స్ మెన సురేంద్రకుమార్, డిప్యూటీ ఎంపీడీవో అనంతశయన, పీఆర్‌డీఈ చంద్రశేఖర్, ఏఈ శివశంకర్, ఏపీడీ మహమ్మద్ బాషా, స్థానిక ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.