Share News

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమిది

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:26 AM

తమకు మేలు చేసేలా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమిది

  • హర్షం వ్యక్తం చేసిన సంఘాలు

  • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): తమకు మేలు చేసేలా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2004, సెప్టెంబరుకు ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం వర్తింపచేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్లు, గురుకులాలకు చెందిన ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంపై సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. గత మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ నేతృత్వంలో సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాము ఉద్యోగులకు సహకరించినట్టే ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో గురుకులాల జేఏసీ నాయకులు దామచర్ల మధుసూదనరావు, డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు మోపిదేవి శివ శంకర్రావు, గురు బ్రహ్మం ఉన్నారు.

1న ఉద్యోగ సంఘాలతో సమావేశం

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో నిర్వహించాల్సిన సమావేశాల షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. సోమవారం ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్‌ సర్క్యులర్‌ జారీచేశారు. ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు శాఖాధిపతులు, జిల్లా కార్యాలయాల అధిపతులు, రీజనల్‌ హెడ్‌ ఆఫీసుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే, జూలై 1న మధ్యాహ్నం 3గంటలకు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో నిర్వహించాలని తాజాగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని కూడా జూలై 1కి బదులుగా జూలై 2న జరపాలని ఆదేశించారు.

Updated Date - Jun 30 , 2026 | 04:29 AM