Share News

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కార గ్రహీత ఎల్‌ఆర్‌ స్వామి కన్నుమూత

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:57 AM

ప్రముఖ కథా రచయిత, కవి, అనువాదకుడు లక్ష్మణయ్యర్‌ రామస్వామి (ఎల్‌ఆర్‌ స్వామి) శనివారం నగరంలోని విశాలాక్షినగర్‌లో కన్నుమూశారు.

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కార గ్రహీత ఎల్‌ఆర్‌ స్వామి కన్నుమూత

విశాఖపట్నం/ఎండాడ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథా రచయిత, కవి, అనువాదకుడు లక్ష్మణయ్యర్‌ రామస్వామి (ఎల్‌ఆర్‌ స్వామి) శనివారం నగరంలోని విశాలాక్షినగర్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. డాక్టర్‌ స్వామి కేరళలోని త్రిచూర్‌ సమీపంలోగల బ్రాహ్మణ అగ్రహారంలో జన్మించారు. మలయాళం, తమిళ మాధ్యమాల్లో విద్యాభ్యాసం పూర్తిచేశాక, ముంబైలో రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్‌ కంపెనీలో పనిచేశారు. తర్వాత విశాఖలోని ఆంధ్రా పెట్రో కెమికల్స్‌లో చేరారు. ఈ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేసి, విశాఖలోనే స్థిరపడ్డారు. చిన్నప్పుడు తండ్రి వద్ద సంస్కృతం, ముంబైలో హిందీ నేర్చుకున్న స్వామి, విశాఖలో తెలుగు భాషపై పట్టు సాధించారు. మలయాళం, తెలుగు భాషల్లో పలు రచనలు చేశారు. 1960 నుంచి 1970 వరకు మలయాళంలో విరివిగా కవితలు రాసి యువకవిగా గుర్తింపు పొందారు. విశాఖ వచ్చిన తరువాత తెలుగు నేర్చుకుని ‘జవాబులేని ప్రశ్న’ కథ రాశారు. తెలుగులో సుమారు 200 కథలు, 50 కవితలు రాశారు. 12 పుస్తకాలను మలయాళం నుంచి తెలుగులోకి, 13 పుస్తకాలను తెలుగు నుంచి మలయాళంలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ట్రస్టు, ద్రవిడ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం పలు అనువాదాలు చేశారు. ఆయన అనువదించిన ‘సూఫీ చెప్పిన కథ’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కారం లభించింది. గీతం విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. స్వామి భౌతికకాయాన్ని మార్కిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్‌ జేవీ సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సీపీఐ నాయకుడు ఎం.పైడిరాజు సందర్శించి నివాళులు అర్పించారు. రెండో కుమార్తె స్వగృహంలో ఆదివారం మధ్యాహ్నం వరకు పార్థివ దేహాన్ని ఉంచుతున్నట్టు సాహితీ మిత్రులు తెలిపారు.

Updated Date - Apr 26 , 2026 | 05:58 AM