Share News

Dragon Boat Race: డ్రాగన్‌ పడవ పోటీల విజేత ఏలూరు టీమ్‌

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:10 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ ఉత్సవ్‌ పేరిట మూడురోజులపాటు జాతీయస్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు...

Dragon Boat Race: డ్రాగన్‌ పడవ పోటీల విజేత ఏలూరు టీమ్‌

  • విజేతకు రూ.2లక్షల నగదు, ట్రోఫీ అందజేత

  • పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు శ్రీనివాసవర్మ, అనిత

ఆత్రేయపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ ఉత్సవ్‌ పేరిట మూడురోజులపాటు జాతీయస్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మంగళవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోటీల్లో.. 1000 మీటర్ల విభాగంలో ఏలూరుకు చెందిన బండారు బలగం టీమ్‌ ప్రథమస్థానం దక్కించుకుంది. వీరికి రూ.2లక్షల నగదు పురస్కారం ట్రోఫీని.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అందజేశారు. పల్నాడు టీమ్‌కు ద్వితీయస్థానం రూ.లక్ష, కోనసీమ టీమ్‌కు తృతీయ స్థానం రూ.50వేల నగదు పురస్కారం, ట్రోఫీలను అందజేశారు. 500మీటర్ల విభాగంలో జంగారెడ్డిగూడేనికి చెందిన ఎర్రకాలువ టీమ్‌ ప్రథమ స్థానం రూ.70వేలు, కర్నూలు టీమ్‌ ద్వితీయ స్థానం రూ.50వేలు, పల్నాడు-2 తృతీయ స్థానం రూ.30వేలు, ట్రోఫీలు అందజేశారు. అంతకుముందు ఈ పోటీలను హోమంత్రి అనిత, పర్యాటకమంత్రి కందుల దుర్గేశ్‌, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రారంభించారు. కాగా, సంక్రాంతి సంబరాల్లో భాగంగా పర్యాటక ప్రదేశమైన ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్‌ఫెస్టివల్‌ను హోంమంత్రి అనిత సందర్శించారు. ఆత్రేయపురం పూతరేకులను ఆమె రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రులు అనిత, కందుల దుర్గేశ్‌ సరదాగా సోది చెప్పించుకున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 05:10 AM