Share News

ఏలూరుకు రెడ్‌ కార్పెట్‌

ABN , Publish Date - May 19 , 2026 | 05:50 AM

ఆ అందమైన తివాచీలను చూస్తే భలే ఉన్నాయే..! అని అనిపిస్తుంది. చేతితో అత్యంత నైపుణ్యంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన పనితనానికి ఎవరైనా ముగ్ధులవుతారు.

ఏలూరుకు రెడ్‌ కార్పెట్‌

  • పునర్వైభవం దిశగా తివాచీ పరిశ్రమ

  • రూ. 10 కోట్లతో కార్పెట్‌ క్లస్టర్‌

  • ముందుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

  • చేతితో ఆకర్షణీయమైన తివాచీలు తయారీ

  • ఒకప్పుడు దేశ విదేశాల్లో డిమాండ్‌

  • చైనా కార్పెట్లతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం

  • ఇప్పటికీ ఆసక్తి తగ్గని ఎగుమతిదారులు

  • శిక్షణ ఇస్తే ఎక్కువ మంది యువతకు ఉపాధి

(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

ఆ అందమైన తివాచీలను చూస్తే భలే ఉన్నాయే..! అని అనిపిస్తుంది. చేతితో అత్యంత నైపుణ్యంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన పనితనానికి ఎవరైనా ముగ్ధులవుతారు. ఏలూరుకే వన్నెతెచ్చిన ఆ తివాచీలకు ఒకప్పుడు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండేది. ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి, లక్ష్మీవారపుపేట, శనివారపుపేట, ఆదివారపుపేట ప్రాంతాలు రంగురంగుల తివాచీ తయారీకి కేంద్రాలుగా ఉండేవి. కొన్ని వందల మగ్గాలపై ఇక్కడ నిత్యం తీరిక లేకుండా పనిసాగేది. దేశవిదేశాల నుంచి ఆర్డర్లు ఇచ్చి తయారు చేయించుకునేవారు. తయారీదారులు, కొనుగోలుదారులతో కళకళలాడిన ఈ ప్రాంతాలు గత రెండు దశాబ్దాలుగా వెలవెలబోతున్నాయి. చైనా తివాచీల రాకతో ఇక్కడి పరిశ్రమ కష్టాల్లో పడింది. కరోనా కాలంలో చాలా యూనిట్లు మూతపడ్డాయి. ఏలూరు తివాచీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో ఏలూరులో రూ. 10 కోట్లతో కార్పెట్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీపీఆర్‌ను సిద్ధం చేశాయి. దీంతో ఏలూరు తివాచీ పరిశ్రమకు కొత్త జవసత్వాలు వస్తాయని వేలాది మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు.


నాణ్యత, మన్నికే గుర్తింపు..

ఏలూరు తివాచీ పరిశ్రమకు అంతటి గుర్తింపు రావడానికి కారణం మన్నిక, నాణ్యత. స్వచ్ఛమైన ఉన్ని, జూట్‌, కాటన్‌ను ఉపయోగించి అందమైన తివాచీలు తయారు చేస్తారు. సహజమైన రంగులనే తివాచీలకు వాడతారు. 1936 నుంచి 2004 వరకు ఇక్కడి నుంచి వివిధ రకాల కార్పెట్లు అమెరికా, ఆస్ర్టేలియా, జర్మనీ, ఇంగ్లండ్‌లకు ఎగుమతి అయ్యేవి. అప్పట్లో నిష్ణాతులైన 50 మంది కార్మిక కుటుంబాలుండేవి. కాలక్రమంలో యంత్రాలతో చేసిన తివాచీలు మార్కెట్‌ను ముంచెత్తాయి. చైనా, ఇతర దేశాలు వాటిని ఆక్రిలిక్‌ పెయింట్స్‌, ఫైబర్‌ లాంటి కృత్రిమ ముడి సరుకుతో తయారు చేయడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. చైనా కార్పెట్‌ పాలిస్టర్‌ క్లాత్‌ను వాడతారని, దీనివల్ల ఇళ్లలో వేడి పెరుగుతుందని ఇక్కడి వర్కర్లు చెబుతున్నారు. తాము చేతితో తయారు చేసిన కాటన్‌, జూట్‌ కార్పెట్లు చల్లదనం ఇస్తాయని వివరించారు.


సొసైటీ చొరవతోనే కదిలిన యంత్రాంగం

కార్మికుల ఉపాధి విషయంలో ది ఏలూరు పైల్‌ కార్పెట్‌ వీవర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ చొరవ చూపింది. కొద్ది నెలల క్రితం కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన సొసైటీ నేతలు పరిస్థితి వివరించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు పలు దఫాలుగా పరిశీలనలు జరిపాక జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్‌.వెంకట్రావు రూ.10 కోట్ల వ్యయంతో కార్పెట్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో 70 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం, పది శాతం సొసైటీ భరించేలా నిర్ణయించారు. ప్రస్తుతం సొసైటీ స్థలం రెండెకరాల్లో నిర్మించిన మూడు షెడ్లలో మగ్గాల ద్వారా కార్మికులు కార్పెట్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ కార్మికులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది.

ప్రోత్సహిస్తే ఎగుమతిదారులు వస్తారు

కేంద్ర ప్రభుత్వం స్వదేశీ వస్తువుల తయారీపై ఆసక్తి చూపుతోంది. రాష్ట్రం కూడా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కోరుతోంది. ఏలూరులో బెస్ట్‌గా ఉన్న తివాచీ పరిశ్రమ వృద్ధికి ప్రభుత్వాలు ఇంకా చర్యలు చేపట్టాలి. ఎగుమతిదారులుగా మేము ఈ వృత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చాలా మంది ఎగుమతిదారులు ఇక్కడకు వస్తారు. విరివిగా ఈ సొసైటీకి ముడిసరుకును కూడా సరఫరా చేస్తున్నాం.

- జయప్రకాశ్‌ మౌర్య, యూపీ ఎక్స్‌పోర్టర్‌


క్లస్టర్‌ ఏర్పాటుతో పాటు శిక్షణ పెంచాలి

మా తాత ముత్తాల నుంచి ఈ పరిశ్రమలో ఉన్నాం. నాకు 56 సంవత్సరాలు. నా జీవితం ఇందులో వెళ్లదీస్తున్నాను. 1980లో మూడువేల మంది కార్మికులు శనివారపుపేట, దెందులూరులో మగ్గాల్లో పనిచేసేవారు. ఇంతకుముందు ట్రైనింగ్‌ కార్యక్రమాలను కేంద్రం నిర్వహించేది. ఇటీవలే ఒక బ్యాచ్‌గా 30 మందికి శిక్షణ పూర్తి చేశారు. కనీసం ఆరు నెలలైనా యువతకు శిక్షణ ఇవ్వాలి. చదువు లేకపోయినా కూడా యువతను ఈ శిక్షణలో పాల్గొనేలా అవకాశం కల్పించాలి.

- ఇంతియాజ్‌ అహ్మద్‌, సొసైటీ ప్రెసిడెంట్‌

శిక్షణకు మహిళలు సిద్ధంగా ఉన్నారు

కనీసం రోజుకు మూడు, నాలుగు గంటలు పనిచేస్తే రూ. 200 వరకు కూలీ వస్తోంది. ఎప్పటి నుంచో ఈ వృత్తిలో ఉన్నాం. ఆసక్తి ఉన్న మహిళలు చాలా మంది శిక్షణ పొందేందుకు సిద్ధం గా ఉన్నారు. లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటల్లో మా ముస్లిం కుటుంబాలే ఎక్కువ ఈ శిక్షణలో చేరుతున్నారు.

- రెహంతున్నీసా, మగ్గం వర్కర్‌


ముస్లిం కుటుంబాలే ఎక్కువగా..

ఏలూరు తివాచీ పరిశ్రమలో సంప్రదాయబద్ధంగా ముస్లిం కుటుంబాలే ఎక్కువగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నాలుగైదు కుటుంబాలే ఈ పరిశ్రమను నడుపుతున్నాయి. కొంతమంది చిన్న కుటీర పరిశ్రమగా ఇళ్లలోనే వీవర్స్‌ లూమ్‌తో వివిధ రకాలైన డోర్‌మ్యాట్‌లు, కార్పెట్లు, ఇతర అలంకరణలకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. కనీసం నలుగురు నుంచి ఆరుగురి వరకు లూమ్‌ (మగ్గం)పై పనిచేస్తుంటారు. ముడిసరుకును రాజస్థాన్‌, హరియాణాల నుంచి తెస్తుంటారు. నైపుణ్య శిక్షణ తీసుకోవడానికి ఇక్కడి యువత సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే 30 మందితో ఒక బ్యాచ్‌ రెండు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎక్కువ యూనిట్ల ద్వారా ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తే ఖర్చులు తగ్గుతాయి. తివాచీ తయారీకి నూలు, జూట్‌, కాటన్‌పై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2026 | 05:54 AM