Share News

గ్రీన్‌సిటీ సమస్యలపై కదిలిన అధికారులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:16 AM

జిల్లా కేంద్రమైన ఏలూరు 19వ డివిజన్‌లోని గ్రీన్‌ సిటీ సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్‌ అధికారులు కదిలారు.

గ్రీన్‌సిటీ సమస్యలపై కదిలిన అధికారులు

  • జేసీబీతో డ్రెయిన్లు శుభ్రం.. పార్కుకు విద్యుత్‌ లైన్‌

  • దశలవారీగా పనులు పూర్తి: ఎమ్మెల్యే చంటి

ఏలూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన ఏలూరు 19వ డివిజన్‌లోని గ్రీన్‌ సిటీ సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్‌ అధికారులు కదిలారు. సోమవారం మూడు గంటలపాటు డ్రెయిన్లలో పూడికతీత, పార్కు పరిసరాల్లో వ్యర్థాలు, చెట్ల నరికివేత చేపట్టారు. ఈ నెల 15న ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో ప్రజలు లేవనెత్తిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), కో ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు హామీ ఇచ్చారు. ఈమేరకు సోమవారం మైకాన్‌ అపార్టుమెంట్‌ పరిసరాల్లో డ్రెయిన్లలో పూడికలు తీశారు. మూడు గంటలపాటు శ్రమించిఇ డ్రైన్‌లోని జమ్ము, తూడు తొలగించి, మురుగు నీటిపారుదలకు మార్గం సుగమం చేశారు. పార్కు పరిసరాల్లో రోడ్డుకు అడ్డంగా పెరిగిన చెట్లను కొట్టివేశారు. పార్కు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పార్కులో గ్రీన్‌సిటీ డెవల్‌పమెంట్‌ సొసైటీ ఏర్పాటు చేసుకున్న మినీ హైమాస్ట్‌ లైట్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. చిన్నారులు ఆడుకోడానికి, సీనియర్ల వాకింగ్‌కు అనువుగా పార్కులో లైటింగ్‌ అమరింది. ఈ పనులను గ్రీన్‌సిటి డెవల్‌పమెంట్‌ సొసైటీ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ రమేశ్‌ పర్యవేక్షించారు. అధికారుల స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ.. ‘ఆంధ్రజ్యోతి’కి ధన్యవాదాలు తెలిపారు. స్థానికులు లేవనెత్తిన మిగిలిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చంటి చెప్పారు.

Updated Date - Mar 24 , 2026 | 05:16 AM