కీకారణ్యంలో ‘సౌర’ వెలుగులు!
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:34 AM
ఒకప్పుడు మావోయిస్టుల షెల్ట్‌ర్‌జోన్‌గా ఉన్న దట్టమైన కీకారణ్య ప్రాంతమది!. వాహనాలు వెళ్లేందుకు కూడా రోడ్డు సౌకర్యం లేక గిరిజన కుటుంబాలు...
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన గూడేలకు విద్యుత్
2.8 కోట్ల వ్యయంతో 611 ఇళ్లకు కరెంట్
అడవిలో అభివృద్ధికి.. అర్ధరాత్రి పయనం
ప్రత్యేక వాహనంలో గొట్టిపాటి ప్రయాణం
కార్యక్రమం ప్రారంభంకోసం వెళ్లిన మంత్రి
ముగించుకొని తెల్లవారుజామున వెనక్కి
మార్కాపురం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు మావోయిస్టుల షెల్ట్‌ర్‌జోన్‌గా ఉన్న దట్టమైన కీకారణ్య ప్రాంతమది!. వాహనాలు వెళ్లేందుకు కూడా రోడ్డు సౌకర్యం లేక గిరిజన కుటుంబాలు ఏళ్ల తరబడి అడవిలో జీవనం సాగిస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల సహా పలు గ్రామాల్లో చెంచులు నివశిస్తున్నారు. ‘టైగర్ రిజర్వ్’ కావటంతో రవాణా సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ అనుమతించడం లేదు. అలాంటి గిరిజన పల్లెల్లో ‘వెలుగులు’ అందించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. అనుకున్నదే తడవుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయంపై దృష్టిసారించి కొద్దికాలంలోనే నిరంతర వెలుగుల కోసం అవసరమైన ‘ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టం’కు శ్రీకారం చుట్టారు. రూ.2.80 కోట్లతో 611 గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యానికి ఏర్పాట్లు జరిగాయి. వీటిని స్వయంగా మంత్రి గొట్టిపాటి రవి ప్రారంభించారు. దీనికిగాను ఆయన.. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, కలెక్టర్ రాజాబాబు ఇతర అధికారులతో కలసి నల్లమలలో శుక్రవారం రాత్రి దాదాపు 6 గంటల(రాను, పోను)పాటు ప్రయాణం చేశారు.

అతికష్టం మీద.. పాలుట్ల గిరిజన గూడెంలో సౌర విద్యుత్ వ్యవస్థను ప్రారంభించేందుకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైపాలెం నుంచి మంత్రి కాన్వాయ్ బయలుదేరింది. వాస్తవానికి అటవీమార్గంలో రాళ్లు, నీటి వాగులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని దాటి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా థార్ వాహనశ్రేణిని ఏర్పాటు చేశారు. నాయకులకోసం కమాండర్ జీపులు వినియోగించారు. కొద్దిపాటి వేగంతోనే వాహనాలు నెమ్మదిగా కదులుతూ రాత్రిపూట చేసిన ప్రయాణం భద్రతా సిబ్బందికి సవాల్‌గా మారింది. అయినప్పటికీ.. సోలార్ లైట్లు వెలిగించే కార్యక్రమం కాబట్టి రాత్రిపూటే చేయాలనే సంకల్పంతో మంత్రి రవి పట్టుబట్టారు. అలా దాదాపు 3 గంటలు ప్రయాణించి పాలుట్లకు చేరుకున్న మంత్రి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, స్థానిక గిరిజనులతో కలిసి భోజనం చేశారు. ఏళ్లతరబడి అడవి మధ్య అంధకారంలో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వానికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం తిరుగు పయనంలో మంత్రి కాన్వాయ్ తెల్లవారుజామున తర్వాత మైదాన ప్రాంతానికి చేరుకుంది.