Share News

విద్యుత్తు కొనుగోళ్లలో 4,398 కోట్లు ఆదా!

ABN , Publish Date - May 09 , 2026 | 04:18 AM

విద్యుత్తు రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.

విద్యుత్తు కొనుగోళ్లలో  4,398 కోట్లు ఆదా!

  • రెండేళ్లలో 55 పైసలు తగ్గిన కొనుగోలు వ్యయం

  • 2024లో యూనిట్‌ సగటు ధర రూ.5.45

  • 2026 మార్చి నాటికి రూ.4.90కి తగ్గింపు

  • సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన విద్యుత్తు కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టడి చేసింది. ఫలితంగా వైసీపీ హయాంలో సగటున యూనిట్‌ ధర రూ.5.45 ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.4.90కి తగ్గించగలిగారు. ఒక్కో యూనిట్‌పై 55 పైసల వరకూ మిగలడంతో ఏడాదిలోనే సుమారు రూ.4,398 కోట్లు ఆదా చేయగలిగారు. విద్యుత్తు కొనుగోలు వ్యయంపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 79,971 ఎంయూ కొనుగోలు చేసేందుకు రూ.39,211 కోట్లు ఖర్చు చేశారు. యూనిట్‌ సగటు వ్యయం రూ.4.90గా నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2025 ఏప్రిల్‌ నాటికి సగటు యూనిట్‌ కొనుగోలు వ్యయాన్ని రూ.5.20కి తెచ్చారు. 2026 మార్చి నాటికి రూ.4.90కి తీసుకురాగలిగారు. 2026 చివరి నాటికి దీన్ని రూ.4.60కి, 2029కి రూ.4.20కి 2030కి రూ.3.90కి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో సగటు విద్యుత్తు వినియోగం రోజుకు 240 ఎంయూ వరకు ఉంటుంది. వేసవిలో ఇది 280 నుంచి 300 ఎంయూలకు చేరుతుంది. జెన్కో హైడల్‌, థర్మల్‌ ప్రాజెక్టుల ద్వారా సుమారు 100 ఎంయూ సమకూరుతుండగా, నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ సోర్స్‌(ఎ్‌ససీఈఎ్‌స)ల ద్వారా మరో 120 నుంచి 150 ఎంయూలు సమకూర్చుకుంటున్నారు. మరో 30 ఎంయూ వరకు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ హయాంలో ఒక్కోరోజుసుమారు 80 ఎంయూ కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో థర్మల్‌, హైడల్‌ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలో థర్మల్‌ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 6,610 మెగావాట్లు కాగా, వైసీపీ హయాంలో గరిష్ఠంగా 4వేల మెగావాట్ల ఉత్పత్తిని మాత్రమే ఇవి చేరుకోగలిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్తు ప్లాంట్ల మరమ్మతులతో పాటు నాణ్యమైన బొగ్గు కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో 6,160 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిన థర్మల్‌ ప్లాంట్లు లైఫ్‌ టైం రికార్డు నమోదు చేశాయి. ఇక రాష్ట్రంలోని హైడల్‌ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 1,773 మెగావాట్లు. కాగా వైసీపీ హయాంలో చాలా యూనిట్లు నిర్వహణ లోపంతో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికే పరిమితమయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీలేరు కాంప్లెక్స్‌లోని పలు ప్రాజెక్టులను మరమ్మతులు చేసి మూలనపడిన యూనిట్లను గాడిలో పెట్టింది. ఫలితంగా హైడల్‌ విద్యుత్తు ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.


సౌర విద్యుత్తుతో భారీ ఆదా

వ్యవసాయ, గృహావసరాలకు సౌర విద్యుత్తును వినియోగించుకోవాలన్న లక్ష్యంతో పీఎం కుసుమ్‌, పీఎం సూర్యఘర్‌ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా హైడల్‌, థర్మల్‌ విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచన. వ్యవసాయ పంపుసెట్లకు పీఎం కుసుమ్‌ ద్వారా పూర్తిస్థాయిలో సోలార్‌ ఎనర్జీ ద్వారానే సరఫరా చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద 1,162.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. గృహావసరాలకు సైతం సౌర విద్యుత్తును వినియోగించుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీఎం సూర్యఘర్‌ కింద సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి 7.25 లక్షల దరఖాస్తులు రాగా 1.31 లక్షల ఇళ్లలో సోలార్‌ ప్యానెళ్లు అమర్చారు. వీటి మొత్తం సామర్థ్యం 441 మెగావాట్లు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర భవనాలపై 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. భారీ ఎత్తున సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటునూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా బయటి నుంచి విద్యుత్తు కొనుగోలు చేసే అవసరం క్రమేణా తగ్గిపోతూ వస్తోంది.

Updated Date - May 09 , 2026 | 04:19 AM