Share News

కరెంటు తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:26 AM

కడప జిల్లా వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్‌ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్‌, కండక్టర్‌ సురక్షితంగా బయటపడ్డారు.

కరెంటు తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం

  • 18 మంది ప్రయాణికులు సురక్షితం

  • కడప జిల్లాలో ఘటన

వేంపల్లె, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్‌ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్‌, కండక్టర్‌ సురక్షితంగా బయటపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరి డిపో ఆర్టీసీ బస్సు (ఏపీ02 జడ్‌ 0187) కడప నుంచి కదిరి బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వేంపల్లెకు వచ్చింది. అక్కడి నుంచి కదిరికి వెళుతుండగా 2.30 సమయంలో వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్‌ వైర్లు తాకడంతో బస్సుకు నిప్పంటుకుంది. ఈ మార్గంలో రాయచోటి-చాగలమర్రి జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎదురుగా టిప్పర్‌ రావడంతో బస్సును పక్కకు తప్పించే క్రమంలో పైనున్న 11కేవీ విద్యుత్‌ వైర్లు బస్సు పైభాగానికి తగిలి మంటలు చెలరేగాయి. మంటల శబ్దం విన్న డ్రైవర్‌ వలీ బస్సును పక్కన ఆపి.. ప్రయాణికులను కిందికి దింపేశారు. బస్సు పైభాగానికి విద్యుత్‌ వైర్లు తగిలిన సమయంలో మంటలు చెలరేగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, డ్రైవర్‌ సూచనతో బస్సులో ఉన్న వారంతా కిందకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగేసరికే బస్సు దాదాపు కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు, విద్యుత్‌ అధికారులు పరిశీలించారు. రోడ్డు పనులు చేయిస్తున్న అధికారులు, విద్యుత్‌ అధికారుల సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరా తీశారు. విజయవాడలో మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి 18 మంది ప్రాణా లు కాపాడారని.. ఘటనపై విచారణ చేస్తామన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 04:29 AM